Share News

ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:15 AM

ఏపీ ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు(సోమవారం) భవానీపురం రైతు బజార్‌లో బియ్యం పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.

ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు
Minister Nadendla Manohar

విజయవాడ, అక్టోబర్ 12: ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు(సోమవారం) భవానీపురం రైతు బజార్‌లో బియ్యం పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరకులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం లోతుగా కసరత్తు చేసిందన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లలో బీపీటీ సన్న రకం బియ్యం కేజీ రూ.49 చొప్పున 26 కేజీల బ్యాగ్‌లో ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఎక్కువగా కోరుకునే నెల్లూరు కేఎన్ఎం వెరైటీ బియ్యం మార్కెట్లో రూ.85 ఉండగా, కేవలం రూ. 50 కే పౌరసరఫరాల శాఖ ద్వారా ఇస్తున్నామని చెప్పారు. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉంచామన్నారు. మార్కెట్లో రూ.50 వరకు ఉన్న గోధుమ పిండిని కేవలం రూ.25 కే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.


రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిల్‌ను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తామని నాదెండ్ల తెలిపారు. మార్కెట్లో ఉల్లిపాయల నాణ్యతపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని, నాగ్‌పూర్ నుంచి నాణ్యమైన ఉల్లిపాయలను తెప్పించి రూ.35 కేజీ చొప్పున ఈరోజు నుంచి అన్ని రైతుబజార్లలో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పును కూడా డీమార్ట్ ధరకంటే 35 శాతం తక్కువ ధరకు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఈ పండుగ సీజన్‌లో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం వంద శాతం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, ఇతర నేతలు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 11:55 AM