Share News

21 శాతం హియరింగ్‌ ‘సర్‌’

ABN , Publish Date - Sep 11 , 2026 | 10:06 AM

ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) నోటీసులకు ఓటర్లు స్పందించడం లేదు.

21 శాతం హియరింగ్‌ ‘సర్‌’
Hyderabad SIR hearings

  • నోటీసులిచ్చింది 80 శాతం.. ఆసక్తి చూపని నగరవాసులు

  • సనత్‌నగర్‌లో మరీ అధ్వానం.. ఇప్పటి వరకు వచ్చింది 2606 మంది ఓటర్లు

  • కార్వాన్‌లో అత్యధికంగా 30 వేలకుపైగా..

  • తుది జాబితాలో మరింత తగ్గనున్న ఓటర్ల సంఖ్య

హైదరాబాద్‌ సిటీ: ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) నోటీసులకు ఓటర్లు స్పందించడం లేదు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 80శాతం మందికి నోటీసులు జారీ చేయగా, కేవలం 21శాతం మంది మాత్రమే విచారణ(హియరింగ్‌)కు వచ్చారు. 15 శాతం ఓటర్లకు రెండు సార్లు విచారణకు అవకాశం కల్పించారు. అయినా వారిలో చాలామంది పట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.


నోమ్యాపింగ్‌, ఎనామలీస్‌ పేరిట మూడు, నాలుగు రకాల డాక్యుమెంట్లు తప్పనిసరి అని అధికారులు చెబుతుండడం.. ఆ పత్రాలు అందుబాటులో లేకపోవడంతో విచారణకు వెళ్లేందుకు ఓటర్లు వెనుకాడుతున్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 12.54 లక్షల మందికిగాను 9.98 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు విచారణకు వచ్చింది 2.16 లక్షల మంది మాత్రమే.


భారీగా తగ్గనున్న ఓటర్లు

ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ ముసాయిదా జాబితా ప్రకారం అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం కేటగిరీలోకి వెళ్లిన సనత్‌నగర్‌లో మరోసారి భారీగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 75,835 మందికిగాను జిల్లాలోనే అత్యధికంగా 73,917 (97.47 శాతం) మందికి నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 2,606 (3.5 శాతం) ఓటర్లు మాత్రమే విచారణకు వచ్చారు. గడువు ముగిసిన అనంతరం రీ షెడ్యూల్‌ చేసినా చాలామంది డాక్యుమెంట్లు సమర్పించేందుకు ముందుకు రావడం లేదు.


city3.2.jpgదీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బహదూర్‌పురాలో 84,617 మందికిగాను 72,076 మందికి నోటీసులు ఇచ్చారు. వీరిలో 8273(11.47 శాతం) మాత్రమే విచారణకు వచ్చారు. ముషీరాబాద్‌లో 8,405, కంటోన్మెంట్‌లో 8,539 మంది మాత్రమే విచారణకు వచ్చారు. అత్యధికంగా కార్వాన్‌ నియోజకవర్గంలో 30,227, యాకుత్‌పురాలో 29,041, జూబ్లీహిల్స్‌లో 22,462 మంది ఓటర్లు విచారణకు హాజరయ్యారు.


జిల్లాలో 47.36 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితాలో 27.95కు తగ్గింది. ఇందులో 12.54 లక్షల మందికి నోటీసులు ఇస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు సమర్పిస్తేనే వీరి పేరు తుది జాబితాలో ఉంటుంది. విచారణకు మెజార్టీ ఓటర్లు హాజరు కాని నేపథ్యంలో జిల్లా ఓటర్ల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పాము విషానికి కొత్త విరుగుడు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 10:06 AM