దిగని ఉల్లి.. పైపైకి వెల్లుల్లి!
ABN , Publish Date - Sep 11 , 2026 | 09:43 AM
హైదరాబాద్ నగరంలోని మార్కెట్‌లో వెల్లుల్లి ధరలు వడివడిగా పెరుగుతున్నాయి. ఉల్లిపాయ రేట్లు దిగనని చెబుతున్నాయి.
ధరలతో వంటింటి బడ్జెట్ కుదేలు
మలక్‌పేట్ మార్కెట్‌లో వెల్లుల్లి క్వింటాల్ రూ.20 వేలు
రెండు రోజుల్లో రూ.1000 పెరిగిన పరిస్థితి
ఎర్ర ఉల్లిగడ్డలో క్వింటాల్‌పై రూ.200 పెరుగుదల
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని మార్కెట్‌లో వెల్లుల్లి ధరలు వడివడిగా పెరుగుతున్నాయి. ఉల్లిపాయ రేట్లు దిగనని చెబుతున్నాయి. మరోవైపు అల్లం ధరలు అటుఇటుగా మారుతూ దోబూచులాడుతున్నాయి. ఈ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో రోజుకు రెండు, మూడు కూరలు వండుకున్న వారు ఇటీవల పెరుగుతున్న రేట్లతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు పేద వర్గాలకు చెందిన వారు సగం మోతాదుతోనే కూరలను తయారు చేస్తూ సరిపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.
తగ్గిన ఉల్లిగడ్డ దిగుబడి
ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పొరుగు రాష్ర్టాల్లో ఉల్లిగడ్డ దిగుబడి బాగా తగ్గింది. వాస్తవంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి, కర్ణాటక ఎక్కువ సంఖ్యలో వస్తుంటుంది. అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఏపీలోని కర్నూల్ నుంచి దిగుమతి అవుతుంటుంది. కాగా, కర్ణాటక, జహీరాబాద్, కోహిర్ నుంచి అల్లం, మధ్యప్రదేశ్ నుంచి ఎల్లిగడ్డ వస్తుంటుంది. అయితే ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో దిగుబడి తగ్గడంతో పాటు పాత ఉల్లి తడిసిపోయి దెబ్బతినడంతో మార్కెట్‌లో రేట్లు అనివార్యంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే అల్లం, వెల్లుల్లిలో ఆశించిన సరఫరా లేకపోవడంతో, ఇప్పటికే తమ వద్ద నిల్వ చేసుకున్న సరుకును కొందరు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరల పెరుగుదల చోటుచేసుకుంటుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
క్వింటాల్ ఎల్లిగడ్డ రూ.20వేలు
మలక్‌పేట్ మార్కెట్‌లో గురువారం ఎల్లిగడ్డ క్వింటాల్ అత్యధికంగా రూ.20వేలు పలికింది. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అల్లంకు గరిష్టంగా రూ.11.600 రేటు వచ్చింది. కాగా, జహీరాబాద్, కోహిర్‌కు చెందిన అల్లానికి రూ.9వేలు పలికింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని ఎర్ర ఉల్లిగడ్డ క్వింటాల్‌కు రూ.5,200, కర్నూల్ గడ్డకు రూ.4,600 రేటు వచ్చింది. కాగా, కర్నూలు తెల్ల ఉల్లిగడ్డకు మాత్రం రూ.5000లు పలికింది.
మార్కెట్‌లో రైతుల నుంచి సరుకును కొనుగోలు చేసిన హోల్‌సేల్ వ్యాపారులు ఆయా ధరలను మరింత పెంచి విక్రయించారు. ఎల్లిగడ్డను కిలోకు రూ.205, అల్లం కిలో రూ.120కి అమ్మిన పరిస్థితి కనిపించింది. అలాగే ఎర్ర ఉల్లిగడ్డను కిలో రూ.55కు, తెల్ల ఉల్లిని కిలోకు రూ.52కు విక్రయించారు. ఇదిలా ఉండగా, హోల్‌సేల్ రేట్లతో పోల్చితే రిటైల్ దుకాణాల్లో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. ధరల నియంత్రణను ఎవరూ పట్టించుకోకపోవడంతో దొరికినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హోల్‌సేల్‌లో కందిపప్పు కిలో రూ.125
నాలుగు రోజుల క్రితం వరకు హోల్‌సేల్ దుకాణాల్లో నంబర్-1 క్వాలిటీ కందిపప్పు కిలో రూ.120 ఉండగా.. గురువారం రూ.125కి చేరినట్లు చాదర్‌ఘాట్‌లోని ఓ హోల్‌సేల్ వ్యాపారి తెలిపారు. కాగా, దీనిని రిటైల్ దుకాణంలో రూ.135 వరకు విక్రయించారు. రూ.49 వరకు ఉన్న పంచదార రేటు రూ.55కు చేరింది. రిటైల్ షాపులో చక్కెరను రూ.60కి అమ్మారు. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వంటలకు కావాల్సిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లం, కందిపప్పు, పంచదార రేట్లు వడివడిగా పెరుగుతుండడంతో పరేషాన్ అవుతున్నారు. ఇదిలా ఉండగా, ధరల నియంత్రణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు రూ.32కు కిలో ఉల్లిపాయలను ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ ధరతో ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

బిర్యానీల్లో ఉల్లిపాయ కోత
ఇళ్లల్లో చేసుకునే వంటల్లో మాదిరిగా హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీల్లో సలాడ్‌గా ఇచ్చే ఉల్లిపాయల్లో కూడా కోత విధిస్తున్నారు. గతంలో రెండు నిమ్మకాయ, నాలుగు ఉల్లిపాయ ముక్కలను ఇచ్చిన నిర్వాహకులు తాజాగా పెరుగుతున్న రేట్లతో వాటిని ఒకటి, రెండింటికే కుదిస్తున్నారు. వాటి స్థానంలో కీరదోస కాయ ముక్కలను అందిస్తున్నారు. పానీపూరిల్లో కూడా ఉల్లిపాయలను ఇవ్వడంలేదని పలువురు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పాము విషానికి కొత్త విరుగుడు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News