పాము విషానికి కొత్త విరుగుడు..
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:40 AM
నాగుపాము, చంద్రనాగుతోపాటు.. మనదేశంలో కనిపించే రెండు రకాల రాచనాగుల విషాల నుంచి కాపాడే ‘రీకాంబినెంట్ యాంటీ వెనమ్’ను బెంగళూరులోని..
ప్రయోగశాలలోనే తయారుచేయగలిగిన యాంటీవెనమ్‌ను అభివృద్ధి చేసిన ఐఐఎస్‌సీ, డెన్మార్క్ వర్సిటీ పరిశోధకులు
నాగు, చంద్రనాగు, రాచనాగుల విషాల నుంచి కాపాడే దివ్యౌషధమని వెల్లడి
బెంగళూరు, సెప్టెంబరు 10: నాగుపాము, చంద్రనాగుతోపాటు.. మనదేశంలో కనిపించే రెండు రకాల రాచనాగుల విషాల నుంచి కాపాడే ‘రీకాంబినెంట్ యాంటీ వెనమ్’ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ), టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ పద్ధతిలో అయితే.. పాము విషాన్ని అత్యంత స్వల్ప మోతాదులో గుర్రాల శరీరాల్లోకి ఇంజెక్ట్ చేసి, వాటిలో తయారైన యాంటీబాడీలను సేకరించడం ద్వారా యాంటీ వెనమ్‌ను తయారుచేస్తారు. అది ప్రాణాలను కాపాడినప్పటికీ.. జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలతో తయారుచేసింది కావడం వల్ల కొంతమందికి యాంటీ వెనమ్ కారణంగా దురదలు, అలర్జీల వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. దాని తయారీకి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. ఒక్కోసారి ఒక్కో జంతువు నుంచి సేకరించిన యాంటీబాడీలు వాడడంతో తయారయ్యే యాంటీవెనమ్ పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది. కానీ, ‘రీకాంబినెంట్ యాంటీ వెనమ్’ అంటే.. అది బయోటెక్నాలజీ సాయంతో పూర్తిగా ప్రయోగశాలలో తయారుచేసిన యాంటీ వెనమ్. అయితే, దీని తయారీలో కూడా ఒంటె జాతికి చెందిన (అల్పాకాలు, లామా ల వంటి) జంతువుల నుంచి సేకరించిన నానోబాడీలను ఉపయోగించుకున్నారు. వాటి సాయంతో.. పాము విషాన్ని విరిచే ఐదు యాంటీబాడీలున్న ప్రత్యేక మిశ్రమాన్ని (కాక్‌టెయిల్) తయారుచేశారు. ‘‘కొత్త పద్ధతిలో కూడా జంతువుల నుంచి నానోబాడీలను సేకరించారు కదా.. మరి పాత పద్ధతికి దీనికి తేడా ఏముంది?’’ అనే సందేహం రావొచ్చు. ఈ కొత్త విధానంలో జంతువుల నుంచి నానోబాడీలను ఒక్కసారి సేకరిస్తే చాలు. పదేపదే వాటిని బాధపెట్టక్కర్లేదు.
సేకరించిన నానోబాడీల డీఎన్‌ఏ కోడ్‌ను (లేదా) జన్యు సమాచారాన్ని తెలుసుకుని, దాన్ని భద్రపరచి.. ల్యాబ్‌లోనే ఆ నానోబాడీలను, వాటితో యాంటీవెనమ్‌ను పెద్ద ఎత్తున తయారుచేయొచ్చు. ఇలా తయారుచేసే యాంటీ వెనమ్ వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం దాదాపు ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ‘‘పాము విషానికి విరుగుడు తయారుచేయడానికి ప్రస్తుతం మనం వాడుతున్న పద్ధతి 100 ఏళ్లుగా మారలేదు. మేం తయారుచేసింది.. తదుపరితరం యాంటీ వెనమ్. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న పాముకాటు సమస్యను సమర్థంగా ఎదుర్కోగలదు’’ అని ఐఐఎ్‌ససీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కార్తీక్ సునగర్ తెలిపారు. ట్రయల్స్‌లో భాగంగా వారు.. ఎలుకలకు నాగు, చంద్రనాగు, రాచనాగుల విషాన్ని ఎక్కించి.. అవి విషప్రభావానికి గురైన(అరగంట) తర్వాత ఈ యాంటీ వెనమ్ ఇవ్వగా అవి కోలుకున్నాయి.