Share News

టీటీడీ నకిలీ అధికారులపై కేసు నమోదు.. వీఐపీ దర్శనం ఇప్పిస్తామని మోసం

ABN , Publish Date - Sep 11 , 2026 | 08:50 AM

వీఐపీ దర్శనం, గదులు ఇప్పిస్తామని భక్తులను మోసం చేస్తున్న టీటీడీ నకిలీ సూపరింటెండెంట్లపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

టీటీడీ నకిలీ అధికారులపై కేసు నమోదు.. వీఐపీ దర్శనం ఇప్పిస్తామని మోసం

తిరుపతి, సెప్టెంబరు 11: టీటీడీలో సూపరింటెండెంట్లమంటూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు వ్యక్తులపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితుడి కథనం ప్రకారం.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ ప్రసన్నకుమార్ కుటుంబంతో తిరుమలకు చేరుకున్నారు. టీటీడీలో సూపరింటెండెంట్‌నంటూ చిన్నంగారి రమణ అనే వ్యక్తి ప్రసన్నను సంప్రదించాడు. వీఐపీ దర్శనం, గదులు ఇప్పిస్తానని చెప్పి బాధితుడి నుంచి రూ. 22వేలు వసూలు చేశాడు. ‘వెబ్‌సైట్ ఓపెన్ అవ్వట్లేదు, సర్వర్ బిజీ అంటూ.. ’ రాత్రంతా కొండపైన అటూ ఇటూ తిప్పుతూ మానసిక వ్యథకు గురిచేశాడు. అడిగితే పొంతనలేని సమాధానం చెబుతూ ఇప్పుడే వస్తానని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మోసాలతో సంబంధం ఉన్న నకిలీ అధికారులు మోకాటి సుబ్రహ్మణ్యం, రమపై కూడా కేసు నమోదు చేశారు.

అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టిక్కెట్లు పొందాలి: సీఐ శ్రీనివాసులు

ఈ నేపథ్యంలో ఈస్ట్ తిరుపతి సిఐ శ్రీనివాసులు భక్తులకు సూచనలు జారీ చేశారు. శ్రీవారి దర్శనాలు, గదుల కేటాయింపులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే పొందాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు సంప్రదించి టీటీడీ దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటే నమ్మవద్దని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..


సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ

డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు


Read Latest Telangana News And AP News

Updated Date - Sep 11 , 2026 | 09:07 AM