డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:40 AM
చిన్న పిల్లలకు డైపర్లు మార్చినట్లు ఈ రోజు నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి, మళ్లీ దానిలో నుంచి ఇంకో పార్టీలోకి దూకేస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
సిద్ధాంతాలకు కట్టుబడని నేత మంచి నాయకుడు కాలేడు
ఆ నేతలంతా రామాచార్యులు జీవితాన్ని చూసి నేర్చుకోవాలి
రామాచార్యులు శతజయంతి సభలో వెంకయ్య వ్యాఖ్యలు
తెనాలి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): చిన్న పిల్లలకు డైపర్లు మార్చినట్లు ఈ రోజు నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి, మళ్లీ దానిలో నుంచి ఇంకో పార్టీలోకి దూకేస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ధోరణి దేశ రాజకీయ వ్యవస్థలో ప్రమాదకర పరిణామమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం బీజేపీ సీనియర్ నేత తమిరిశ రామాచార్యులు శతజయంతి సభ జరిగింది. ఈ సభకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేటి రాజకీయ నాయకులకు రామాచార్యులు ఆదర్శనీయమని వెంకయ్య అన్నారు. తాను పనిచేసిన పార్టీని, ఆ పార్టీ సిద్ధాంతాలను గౌరవించలేని నాయకుడు మంచి నేత కాలేడని, అటువంటివారు ప్రజలకు కూడా మేలు చేయలేరన్నారు. రామాచార్యులు జీవితం నేటి తరం నేతలకు మార్గదర్శకం కావాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ రామాచార్యులు పార్టీ సేవ కూడా దైవార్చన భావంతోనే చిత్తశుద్ధితో చేశారని, అటువంటి నేతలు నేటి కాలంలో అరుదుగానే ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అనంతమైన విజ్ఞాన సంపద కలిగిన రామాచార్యులు నడవడిక, నిరాడంబరత నేటి రాజకీయ నేతలకే కాక భావితరాలకు కూడా ఆదర్శమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News