Share News

ఉమ్మడి కుటుంబాలకు పెద్ద ఇళ్లు

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:17 AM

రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న పేదల కోసం పెద్ద ఇళ్లను నిర్మించడంపై దృష్టి సారించాలని గృహనిర్మాణ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇకపై కుటుంబం యూనిట్‌ గృహ లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ల సదస్సులో చెప్పారు.

ఉమ్మడి కుటుంబాలకు పెద్ద ఇళ్లు
Nara Chandrababu Naidu

  • కుటుంబం యూనిట్‌గా లబ్ధిదారులు

  • ఏడాదిలోగా పేదల గృహ నిర్మాణాలు పూర్తి కావాలి: సీఎం

రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న పేదల కోసం పెద్ద ఇళ్లను నిర్మించడంపై దృష్టి సారించాలని గృహనిర్మాణ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇకపై కుటుంబం యూనిట్‌ గృహ లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. ఇళ్ల కేటాయింపులపై లబ్ధిదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏడాదిలోగా పేదల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి 10 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 1.43 లక్షల మందిని ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించినట్లు వారు ఆయనకు వివరించారు.


మరో 1.26 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వచ్చే నెల 15వ తేదీనాటికి పరిశీలన పూర్తి చేస్తామని తెలిపారు. 1,692 గ్రామాల్లో 18 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమిని గుర్తించామన్నారు. ‘ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలి. ఎంతమందికి కొత్తగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి.. ఎంతమందికి పట్టాలను క్రమబద్ధీకరించాలనే అంశాలపై స్పష్టమైన జాబితాను సిద్ధం చేయాలి’ అని సీఎం సూచించారు. గృహ నిర్మాణాల పురోగతిపైనా ఆయన సమీక్షించారు. ఇప్పటివరకు 5.92 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. మరో 5.32 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అధికారులు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..
సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఏపీ పర్యాటకానికి కేంద్రం సహకారం
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 06:17 AM