సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:04 AM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పటిష్ఠ భద్రత నడుమ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక టెక్నాలజీని జతచేసి హైఎండ్ సీసీ కెమెరాలతో ...
3 వేలకు పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తున్న టీటీడీ
నడక మార్గంలోనూ ప్రత్యేకంగా 110 కెమెరాల అమరిక
తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం
తిరుమల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పటిష్ఠ భద్రత నడుమ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక టెక్నాలజీని జతచేసి హైఎండ్ సీసీ కెమెరాలతో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించేలా టీటీడీ సిద్ధమైంది. శ్రీవారి ఆలయం, క్యూలైన్లు, కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, కార్యాలయాలు, లడ్డూ కౌంటర్, అఖిలాండం ఇలా అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు 2,880 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదనంగా జీఎన్సీ, లేపాక్షి వంటి ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాలు, నిర్మాణాల వద్ద మరో వంద కెమెరాలను ఏర్పాటు అమర్చారు.
అలిపిరి నడకమార్గంలోనూ
మరోవైపు ఈసారి ప్రత్యేకంగా అలిపిరి కాలినడక మార్గంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలినడక మార్గంలోని ఏడో మైలు ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న చిన్నపాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఓ వ్యక్తి అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నడకమార్గాల్లోనే సీసీ కెమెరాల నిఘా అవసరమని భావించిన టీటీడీ 110 కెమెరాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పనులు జోరుగా సాగుతున్నాయి. అలాగే గరుడ సర్కిల్‌లోనూ ఈ ఏడాది అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. జూపార్కు రోడ్డు వైపు వంద మీటర్లు, నంది సర్కిల్‌వైపు మరో వంద మీటర్ల వరకు కవర్ అయ్యేలా వీటిని అమర్చుతున్నారు.
280 మీటర్ల రేంజ్‌ను కవర్ చేసేలా
బ్రహ్మోత్సవ వాహనసేవలు జరిగే నాలుగు మాడవీధుల్లో కట్టుదిట్టమైన భద్రతను కల్పించేలా 140 సాధారణ కెమెరాలతోపాటు హైఎండ్ టెక్నాలజీతో కూడిన నాలుగు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కెమెరా 280 మీటర్ల వరకు కవర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పూర్తి స్పష్టతతో వీడియో రికార్డయ్యేలా ఇవి పనిచేయనున్నాయి. ఈ కెమెరాల పనితీరును తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. అలాగే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కూడా ఈ కెమెరాలను అనుసంధానం చేశారు. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి ఫేసియల్ రికగ్నిషన్, ఫైర్ డిటెక్షన్ అలర్ట్, భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను సులభంగా గుర్తించేలా ఇవి పనిచేయనున్నాయి. ఇలా దాదాపు 3వేలకుపైగా సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్రహ్మోత్సవాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమిలో కొనసాగడానికి జనసేన, బీజేపీకి సిగ్గుండాలి
ఏపీ పర్యాటకానికి కేంద్రం సహకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News