Share News

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం

ABN , Publish Date - Apr 17 , 2026 | 08:03 PM

హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జేకే కాలనీలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం
Hyderabad Mystery Death

హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జేకే కాలనీలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మూడు నెలలుగా తాళం వేసి ఉన్న ఇంట్లో శవం దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అసలేం జరిగిందంటే..?

జేకే కాలనీలోని ఓ ఇంట్లో గతంలో ఒక వ్యక్తి అద్దెకు ఉండేవారు. అయితే, గత మూడు నెలలుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అద్దెదారు కనిపించకపోవడం, కనీసం ఇంటి యజమానికి అద్దె కూడా చెల్లించకపోవడంతో యజమానికి అనుమానం వచ్చింది. ఇంటి యజమాని వచ్చి తాళం విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఇల్లు మొత్తం దుర్వాసనతో నిండిపోయింది. లోపలికి వెళ్లి వెతకగా, వంటగదిలోని కిచెన్‌లో (బండ) కింద గుర్తు తెలియని వ్యక్తి శవం కనిపించింది.


పోలీసుల విచారణ..

సమాచారం అందుకున్న వెంటనే నేరేడ్‌మెట్ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో, అది పురుషుడిదా లేక మహిళదా అనేది కూడా ప్రాథమికంగా గుర్తించలేనంత దారుణంగా ఉంది. శవం కిచెన్ బండ కింద ఉంచడాన్ని చూస్తే, ఇది ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా చంపి అక్కడ దాచిపెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆ ఇంట్లో నివసించిన వ్యక్తి ఎవరు..?, అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


తదుపరి చర్యలు

పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా వివరాలు సేకరించే అవకాశం ఉంది. కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత మూడు నెలల్లో ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జనసంచారం ఉండే కాలనీలో, అది కూడా మూడు నెలల పాటు ఇంట్లో శవం ఉండటం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ మిస్టరీ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు పోస్ట్‌మార్టం నివేదిక, పోలీసుల సమగ్ర విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 08:04 PM