నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ మృతి
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:03 PM
హైదరాబాద్‌లోని నార్సింగి పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఓ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నార్సింగి పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఓ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండకు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఫస్ట్ క్లబ్‌లో డెలివరీ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్న సమద్.. నార్సింగి నుంచి గండిపేట వైపు డెలివరీ తీసుకుని బైక్‌పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సమద్ ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం అత్యంత వేగంతో ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే ఆ వాహనం ఆపకుండా అక్కడి నుంచి సదరు వ్యక్తి పరారయ్యాడు. ఈ ప్రమాదం ధాటికి అదుపుతప్పిన సమద్ బైక్‌తో సహా ఫుట్‌పాత్‌పై పడిపోయి.. తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మృతిచెందాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి వివరాలను గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు నార్సింగి పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో సమద్ బైక్‌ను ఢీకొట్టిన వాహనం ఏది, దానిని ఎవరు నడిపారనే వివరాలను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డెలివరీ కోసం వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News