Share News

Minister Prabhakar: నూతన వాహన టాక్స్ విధానం ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:22 PM

తెలంగాణ రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రవాణా శాఖలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసన సభలో చర్చ జరిగింది.

Minister Prabhakar: నూతన వాహన టాక్స్ విధానం ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar

హైదరాబాద్, జనవరి2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ(శుక్రవారం)రవాణా శాఖలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడారు. 4 వీలర్ తేలికపాటి గూడ్స్ వాహనాలకు త్రైమాసిక టాక్స్ ఉండేదని ప్రస్తావించారు. రవాణా శాఖ నిపుణులతో చర్చించి గూడ్స్‌కి సంబంధించిన వాహనాలపై లైఫ్ టాక్స్ విధిస్తూ 7.5 శాతానికి అమలు చేశామని వివరించారు. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీపై సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక , మహారాష్ట్ర ,గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.


వాటికి రోడ్ సేఫ్టీ సెస్..

ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, లైట్ మోటార్ వాహనాలకు రూ.5 వేలు , హెవీ వాహనాలకు రూ.10 వేలు రోడ్ సేఫ్టీ సెస్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే రోడ్ సేఫ్టీ సెస్ విధించినట్లు వివరించారు. ఆటోలు ,ట్రాక్టర్లకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతోనే జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఇటీవల ఒక ప్రకటన చేశారని ప్రస్తావించారు. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తాము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని.. విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం విద్యాశాఖ, సంక్షేమ శాఖ, పలు పాఠశాలలు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. రోడ్డు భద్రతాపై విద్యార్థులకు, ప్రతి పౌరుడుకి అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. యూనిసెఫ్ సహకారంతో పలు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తెలంగాణను రోడ్డు ప్రమాదాల రహితంగా మార్చడానికి జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్.


ఫిట్‌నెస్ చూసుకోవాలి..

రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే ..1. 80 లక్షల వాహనాలు ఉన్నాయని..ఒక్కొక్కటిగా వాహనాలు పరిశీలించడం కుదరదని చెప్పుకొచ్చారు. ఎవరికీ వారే స్వయంగా వాహనాల ఫిట్‌నెస్ చూసుకోవాలని.. రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. వికారాబాద్ బస్సు ప్రమాదంలో ఎవరో చేసిన తప్పిదానికి అమాయకులు చనిపోయారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ విద్యార్థులు, ఇతర పాఠశాలల్లోని విద్యార్థులు రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు , అధికారులు, విద్యార్థులు అందరూ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో పాల్గొనాలని మార్గనిర్దేశం చేశారు. బ్లాక్ స్పాట్‌లను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అతి వేగాన్ని కట్టడి చేసేలా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రోడ్ సేఫ్టీ మంత్‌పై లేఖ రాశారని ప్రస్తావించారు మంత్రి పొన్నం ప్రభాకర్.


ఆ వాహనాలకు త్రైమాసిక టాక్స్..

రోడ్ సేఫ్టీపై ప్రజలు, అన్ని విభాగాల అధికారులు భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. గూడ్స్ ఆటోలకు , తేలికపాటి వాహనాలకు మాత్రమే త్రైమాసిక టాక్స్ నుంచి లైఫ్ టాక్స్‌‌లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. దాదాపు రూ.1000 కోట్లు టాక్స్‌ను ప్రభుత్వం నష్టపోయిందని అన్నారు. హైదరాబాద్‌లో ఈరోజు ఎయిర్ క్వాలిటీ 300 దాటిందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.


ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్‌ ఏర్పాటు..

ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతాయని.. దీంతో కాలుష్యాన్ని అరికడుతున్నామని చెప్పుకొచ్చారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని.. 15 ఏళ్లు దాటిన వాహనాలు ఈ స్క్రాప్ పాలసీలోకి వస్తాయని వెల్లడించారు. త్వరలో ఢిల్లీ మాదిరిగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రైవింగ్ స్కూల్స్‌పై కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో వాహన సారధిలో తెలంగాణ చేరలేదని చెప్పుకొచ్చారు. దేశంలో 29 రాష్ట్రాలు వాహన సారధిలో చేరితే తెలంగాణ మాత్రం చేరలేదని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వాహన సారధిలో చేర్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్‌రెడ్డి ఫైర్

ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

For More TG News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 05:33 PM