Share News

మంజీరా పైపులైన్‌ ఆధునీకరణకు రూ.551 కోట్లు

ABN , Publish Date - Sep 30 , 2026 | 09:31 AM

హైదరాబాద్‌ మహా నగర దాహార్తి తీర్చేందుకు 61ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మంజీరా పైపులైన్‌ పాత బడింది. దీంతో తరచూ ఏదో ప్రాంతంలో లీకేజీలతో పైపులు పగులుతున్నాయి.

మంజీరా పైపులైన్‌ ఆధునీకరణకు రూ.551 కోట్లు
Manjeera Pipeline

  • రెండేళ్లలో నిర్మాణం, ఐదేళ్ల పాటు నిర్వహణకు టెండర్లు

  • దసరా తర్వాత పనులు ప్రారంభించేలా చర్యలు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగర దాహార్తి తీర్చేందుకు 61ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మంజీరా పైపులైన్‌ పాత బడింది. దీంతో తరచూ ఏదో ప్రాంతంలో లీకేజీలతో పైపులు పగులుతున్నాయి. నీళ్లు వృథాగా పోతున్నాయి. ఈ క్రమంలో నగరానికి మంజీరా జలాలు అందించే ఫేజ్‌-1, ఫేజ్‌-2 వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించేందుకు వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. సరికొత్తగా మైల్డ్‌ స్టీల్‌ (ఎంఎస్‌) పైపులైన్లను వేయనుంది. ఈ మేరకు రూ.551కోట్ల వ్యయంతో పనులు చేపట్టనుంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయడంతో పాటు ఐదేళ్ల పాటు నిర్వహణ కూడా ఎంపికైన నిర్మాణ సంస్థనే చేపట్టాలని షరతులు విధించింది.


సిమెంట్‌ పైపులు శిథిలావస్థకు..

స్వాతంత్య్రం అనంతరం నగరానికి తాగునీటిని అందించేందుకు మంజీరా జలాలను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. 1965లో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నది నుంచి ఫేజ్‌-1లో భాగంగా 1500ఎంఎం సామర్థ్యం గల సిమెంట్‌ పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మంజీరా ఫేజ్‌-2 ప్రాజెక్టును 1981లో పూర్తి చేసి కలబ్‌గూర్‌ నుంచి నగరానికి నీళ్లను తీసుకురాగా అప్పుడు సైతం సిమెంట్‌ పైపులైనునే ఏర్పాటు చేశారు. సిమెంట్‌ పైపులు శిథిలావస్థకు చేరడంతో తరచూ లీకేజీలవుతున్నాయి.


నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌వాల్వ్‌ స్టెమ్‌కు అకస్మాత్తుగా భారీ లీకేజీలు ఏర్పడడం, పైపులైన్ల జాయింట్లు లీకేజీలవ్వడం లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు నీళ్లు నిలిచిపోతున్నాయి. ప్రధానంగా ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, కేపీహెచ్‌బీకాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్‌, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్‌ నగర్‌, జ్యోతి నగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం,


city3.jpgమదీనాగూడ, మియాపూర్‌, దీప్తిశ్రీ నగర్‌, బీరంగూడ, అమీన్‌పూర్‌, నిజాంపేట్‌లతో పాటు పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజీరా పైపులైన్‌ను పూర్తిగా ఆధునీకరించేందుకు సిద్ధమైంది. సిమెంట్‌ పైపులైన్ల స్థానంలో సరికొత్తగా మైల్డ్‌ స్టీల్‌ (ఎంఎస్‌) పైపులైన్లను ఏర్పాటు చేయడానికి వాటర్‌బోర్డు ప్రణాళికలను రూపకల్పన చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.722కోట్లకు పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది.


రెండు దశల్లో పైపులైన్లు

వాటర్‌బోర్డు అధికారులు మంజీరా ప్రాజెక్టును ఆధునీకరించడానికి రూ.551కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. 1700మీ.మీ సామర్థ్యంతో మంజీరా ప్రాజెక్టు నుంచి కలబ్‌గుర్‌ నుంచే లింగంపల్లి వరకు దాదాపు 35కిలోమీటర్ల మేర రెండు దశల్లో పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. మంజీరా డ్యామ్‌ నుంచి సీసీ లైనింగ్‌తో 500మీటర్ల కొత్త కాలువ నిర్మాణం, 225ఎంఎల్‌డీల ఇన్‌టెక్‌ వెల్‌ను, పంపుహౌ్‌సను, కలబ్‌గూర్‌ వద్ద కొత్తగా 232ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను,


గ్రౌండ్‌ లెవల్‌లో 6 మిలియన్‌ గ్యాలన్ల సర్వీసు రిజర్వాయర్‌, క్లియర్‌ వాటర్‌ పంపుహౌస్‌, కంట్రోల్‌ రూమ్‌ తదితర ట్రాన్స్‌మిషన్‌ పనులు చేపట్టనున్నారు. ఈ పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యాన్ని విధించారు. టెండర్‌లో ఎంపికైన నిర్మాణ సంస్థనే మరో ఐదేళ్ల పాటు నిర్వహణ చేపట్టాలని నిబంధనలు కూడా విధించారు. దసరా పండుగలోపు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణ సంస్థను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఆ వెంటనే మంజీరా పైపులైన్‌ ఆధునీకరణ పనులు ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 09:31 AM