ఫేక్ డాక్యుమెంట్లతో ఆస్తుల కబ్జాకు స్కెచ్.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:18 PM
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి నకిలీ పత్రాలు, సీళ్లు, ప్రింటర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు చేశామని మల్కాజిగిరి సీపీ బి.సుమతి (Malkajgiri CP Sumathi) తెలిపారు. వీరిలో మహ్మద్ ఖాజా బాషా, మహ్మద్ జుల్ఫికర్‌లను అరెస్ట్ చేశామని, వినోద్ కుమార్ పరారీలో ఉన్నారని వెల్లడించారు. నకిలీ పత్రాలు, ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. బేగంపేట్ క్యాంపు ఆఫీస్‌లో సీపీ సుమతి ఈరోజు (బుధవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్ల విషయంలో ఎస్ఓటి మల్కాజిగిరి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. ఖాజా పాషా ఇంట్లో 9 కత్తులు, ఫేక్ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఖాళీ బాండ్ పేపర్స్, ఫేక్ రెవెన్యూ స్టాంప్‌లను స్వాదీనం చేసుకున్నామని అన్నారు.
మహ్మద్ జుల్ఫికర్ ఇంట్లో ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్, ఒక డెల్ కంప్యూటర్, ఖాళీ బాడ్ పేపర్స్, ఒక ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామని సీపీ సుమతీ తెలిపారు. వివాదాస్పద, వదిలివేసిన ఆస్తులను నిందితులు టార్గెట్ చేశారని వెల్లడించారు. నిందితులు అసలు యజమానులను, వారసుల వివరాలను సేకరిస్తారని అన్నారు. నకిలీ రెవెన్యూ రికార్డులు, స్టాంపులతో మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. అసలు యజమానులుగా నటిస్తూ నకిలీ సేల్ డీడ్లు, బాండ్ పత్రాలను వీరు తయారు చేశారని తెలిపారు. ఆధార్, పాస్‌పోర్ట్ వంటి నకిలీ గుర్తింపు పత్రాలను కూడా తయారు చేశారని వెల్లడించారు. జుల్ఫికర్ అలీతో కలిసి ఖాజా పాషా ఈ మోసాలకు పాల్పడ్డారని అన్నారు.
నకిలీ పత్రాల తయారీలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించాడని సీపీ సుమతీ చెప్పారు. ఖాజా పాషా తన ఫొటోతో నకిలీ పోలీస్ కార్డు సృష్టించాడని అన్నారు. నకిలీ పత్రాలతో ఆస్తులు విక్రయించడం, రిజిస్ట్రేషన్ లేదా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు. పరారీలో ఉన్న A-3 వినోద్ కుమార్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. నకిలీ పత్రాల నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఆస్తులు కొనుగోలు చేసేముందు పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకోవాలని సూచించారు. టైటిల్, EC, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని మల్కాజిగిరి సీపీ సుమతీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News