Share News

హైదరాబాద్‌లో గన్ కలకలం.. లులు మాల్‌పై కేసు నమోదు

ABN , Publish Date - Jul 14 , 2026 | 10:22 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లులు మాల్‌లో గన్ కలకలం సృష్టించింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హైదరాబాద్‌లో గన్ కలకలం.. లులు మాల్‌పై కేసు నమోదు
Hyderabad Gun Incident

కూకట్‌పల్లి, జులై 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లులు మాల్‌లో గన్ కలకలం సృష్టించింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి వాగ్వాదంపై సమాచారం అందుకున్న KPHB పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో గన్ ఉండటాన్ని గుర్తించారు. అప్రమత్తమైన KPHB సీఐ రాజశేఖర్ రెడ్డి వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


పోలీసుల విచారణలో సిద్దిఖీ వద్ద ఉన్న గన్‌కు చట్టపరమైన లైసెన్స్ ఉన్నట్లు తేలింది. లైసెన్స్ కలిగిన వ్యక్తి తుపాకీతో మాల్‌లోకి ప్రవేశించడం ఎలా సాధ్యమైందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. మాల్ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే గన్‌తో సదరు వ్యక్తి లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా మాల్స్‌లో మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానింగ్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంది. కానీ ఈ ఘటనలో భద్రతపరంగా నిర్లక్ష్యం జరిగింది.


ఈ నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు లులు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు. ఈ ఘటన నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని మాల్స్‌లో భద్రతా తనిఖీలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 11:49 AM