విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:12 PM
విమాన టికెట్ ధరల్లో అనూహ్య పెరుగుదల, పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌లైన్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది.
ఢిల్లీ, జులై 13 (ఆంధ్రజ్యోతి): విమాన టికెట్ ధరల్లో అనూహ్య పెరుగుదల, పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌లైన్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. విమాన ఛార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు సంబంధించి కొత్త విమానయాన నిబంధనలను సిద్ధం చేసినట్లు కేంద్రం తెలిపింది.
కేంద్రం తరఫున సమర్పించిన వివరాల ప్రకారం, ఈ కొత్త విమానయాన నిబంధనలను 30 రోజుల్లోగా పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నట్లు న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. అయితే, పార్లమెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. రెండు వారాల్లోగా కొత్త నిబంధనల ప్రతిని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా పండుగలు, సెలవులు, అత్యవసర పరిస్థితుల్లో విమాన సంస్థలు భారీగా టికెట్ ధరలు పెంచడంపై గతంలోనే సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రయాణికుల ప్రయోజనాల పరిరక్షణకు స్పష్టమైన నిబంధనలు అవసరమని మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది. విమాన ఛార్జీల నియంత్రణకు సంబంధించిన ఈ ప్రజాహిత వ్యాజ్యంపై తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News