ఆ ఇద్దరు నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:34 PM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలను ప్రస్తావించారు.
హైదరాబాద్, జనవరి24 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు(Dharmapuri Arvind) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు(KTR Legal Notice) పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్. తనపై, తన కుటుంబంపై నిరాధార, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ లీగల్ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. నోటీసులు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో, సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
క్షమాపణ చెప్పాలి..
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు.. వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశ పూర్వకంగా, నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ.. చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారని ఆగ్రహించారు.
ఆ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం..
బండి సంజయ్‌కు పంపిన నోటీసుల్లో.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ సహా ఆయన న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని.. సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వక చర్య అని దుయ్యబట్టారు.
రాజకీయ కక్ష సాధింపే..
మరోవైపు ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పంపిన నోటీసుల్లో.. ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు కేటీఆర్. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. తనపై ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడటం రాజకీయ కక్ష సాధింపేనని ధ్వజమెత్తారు. ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేటీఆర్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసులు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News