KTR: అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా రేవంత్‌రెడ్డి తీరు.. కేటీఆర్ ధ్వజం..
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:33 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రివా..? ముఠా నాయకుడివా..? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు..
హైదరాబాద్, జనవరి18 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రివా..? ముఠా నాయకుడివా..? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం గానే కాదు.. హోం మంత్రిగా కూడా ఉన్నావన్న సోయి కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా ? అని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను మరిచి, అసాంఘిక చర్యలు, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటానికి కనీసం సిగ్గనిపించడం లేదా..? అని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం (ఎక్స్) వేదికగా ట్వీట్ పెట్టారు.
సీఎం మైండ్ బ్లాక్..
లా అండ్ ఆర్డర్ నిర్వాహణలో పదేళ్ల పాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు రాజ్యమేలడం తెలంగాణకు పట్టిన దరిద్రమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల గుండెలనిండా గులాబీ జెండాపై చెక్కుచెదరని అభిమానాన్ని చూసి.. ముఖ్యమంత్రి మైండ్ బ్లాక్ అయినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. రెండేళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని.. ఈ రోజు ఖమ్మం సభ సాక్షిగా తేలిపోయిందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే ఆగమేఘాల మీద కేసులు పెట్టి, అరెస్టులు చేసే పోలీసు శాఖ, రాష్ట్ర డీజీపీ.. ఈ రోజు ముఖ్యమంత్రి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
అసలు కుట్ర అర్థమైంది..
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ టీడీపీ పాట పాడటం వెనక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి ఇవాళ అర్థమైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రెండేళ్లుగా పాతబాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను కాలరాశారని.. ఇవాళ చేసిన ప్రకటనతో మీ నిజస్వరూపం బట్టబయలైందని విమర్శించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా రుజువవుతోందన్నారు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక.. ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను నాలుగు కోట్ల సమాజం తప్పకుండా తిప్పికొడుతుందన్నారు. నీళ్ల నుంచి మొదలుకుని నిధులు, నియామకాల వరకూ తెలంగాణను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News