Share News

కొండా సురేఖ ఎపిసోడ్‌కు ముగింపు.. అసలేం జరిగింది?

ABN , Publish Date - Sep 03 , 2026 | 03:44 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు తెరపడింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించినప్పటికీ సురేఖ అంగీకరించకపోవడంతో.. బర్తరఫ్‌కు హైకమాండ్ మొగ్గుచూపింది.

కొండా సురేఖ ఎపిసోడ్‌కు ముగింపు.. అసలేం జరిగింది?
Telangana politics

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు తెరపడింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించినప్పటికీ సురేఖ అంగీకరించకపోవడంతో.. బర్తరఫ్‌కు హైకమాండ్ మొగ్గుచూపింది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆదేశాలతో.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ.. గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు లేఖను పంపారు.


అసలేమైందంటే..

గత నెలలో(ఆగస్టు) కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. పరకాల నియోజకవర్గం రాజకీయాలతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ స్పందిస్తూ.. కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దంటూ క్రమశిక్షణ కమిటీకి సురేఖ వివరణ ఇచ్చారు. అయితే, కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడంపై సురేఖపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపడంతో హైకమాండ్ దృష్టికి వెళ్లింది. సురేఖ వివరణను పరిశీలించిన టీపీసీసీ క్రమిశిక్షణ కమిటీ.. ఆ నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించింది. ఇదే విషయంపై నిన్న(సెప్టెంబర్ 2) సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు టీ.కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసి సురేఖ అంశంపై చర్చించారు. రేవంత్ రెడ్డి కూడా కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అటు కొండా సురేఖ కూడా నిన్న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మాత్రమే కలిసిన సురేఖ.. తన వాదనలను వినిపించినట్లు సమాచారం.


ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కొండా సురేఖ రాజీనామాకు అంగీకరించలేదని.. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను బర్తరఫ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గవర్నర్‌కు సిఫారసు లేఖ పంపించారు. సీఎంను ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు.. చివరకు సురేఖ బర్తరఫ్ నిర్ణయానికి దారితీశాయి. మంత్రి పదవిని కోల్పోయిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచారణపై కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేల్చేస్తారా..

కొండా సురేఖ ఎపిసోడ్.. నేటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో: రాజాసింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 04:47 PM