భావితరాలకు ఉపయోగపడేలా..
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:33 AM
తెలంగాణలో క్రీడాభివృద్ధికి ‘ఖేలో ఇండియా’ పోటీలు బలమైన పునాది కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2002 జాతీయ క్రీడల తర్వాత.. రాష్ట్రంలో మళ్లీ అంతటి భారీ స్థాయి క్రీడా మహోత్సవం ఇదేనని తెలిపారు.
ఖేలో ఇండియా ఏర్పాట్లు శాశ్వతంగా ఉండాలి..
ఈ పోటీలు రాష్ట్ర క్రీడాభివృద్ధికి బలమైన పునాది
ఇతర రాష్ట్రాల్లా తాత్కాలిక ప్రాతిపదికన చేయొద్దు
ఏర్పాట్ల పర్యవేక్షణకు ఒక్కో విభాగానికి ఒక్కో ఇన్చార్జి
జిల్లాల్లో పోటీల నిర్వహణకు ఇన్చార్జి మంత్రులు
ఖేలో ఇండియా పోటీలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా పోటీలు
రూ.120 కోట్లతో స్టేడియాల్లో వసతులు, పరికరాలు
ఎల్బీ స్టేడియంలో షురూ, గచ్చిబౌలిలో ముగింపు వేడుక
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో క్రీడాభివృద్ధికి ‘ఖేలో ఇండియా’ పోటీలు బలమైన పునాది కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2002 జాతీయ క్రీడల తర్వాత.. రాష్ట్రంలో మళ్లీ అంతటి భారీ స్థాయి క్రీడా మహోత్సవం ఇదేనని తెలిపారు. ఈ పోటీల కోసం చేసే ఏర్పాట్లు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా.. భావితరాలకు ఉపయోగపడేలా శాశ్వతంగా ఉండాలన్నారు. ఏర్పాట్ల కోసం ఒక్కో విభాగానికి ఒక్కో ఇన్చార్జిని నియమించాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా జిల్లాల్లో జరిగే క్రీడల పోటీలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లాకో ఇన్చార్జి మంత్రికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 11 నుంచి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యంలో తొలిసారిగా ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 203 కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం తమ వాటాగా రూ.21 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ.120 కోట్లతో స్టేడియాలలో ప్రపంచ స్థాయి అభివృద్థి పనులు, అత్యాధునిక క్రీడా పరికరాలు సిద్ధమవుతున్నాయి. 2002 డిసెంబరులో జరిగిన జాతీయ క్రీడల్లో క్రీడాకారులు, అధికారులు కలిపి సుమారు 8వేల మంది పాల్గొనగా.. ఈసారి ఖేలో ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి 9వేల మందికి పైగా హాజరు కానున్నారు. ఈ సంఖ్య కామన్వెల్త్ క్రీడల కంటే రెట్టింపు అని అధికారులు సీఎంకు చెప్పారు.
క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి..
ఖేలో ఇండియా పోటీలను అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని, ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని సీఎం రేవంత్ అన్నారు. నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు దోహదపడేలా భవిష్యత్తుకు పునాది వేయడంపై దృష్టి సారించాలన్నారు. స్టేడియాల పునరుద్ధరణతోపాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. స్టేడియాల్లో ఏర్పాట్ల నాణ్యతపై విజిలెన్స్ నిఘా ఉండాలన్నారు. పోటీల్లోని అన్ని వేదికల్లో టాయిలెట్లతో సహా అన్ని నిర్వహణ అవసరాలకు.. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వాడాలని ఆదేశించారు.
ఏర్పాట్లకు సంబంధించి ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని ఇన్చార్జులుగా నియమించి బాధ్యులను చేయాలని సూచించారు. ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్నారు. ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాలవారీగా మంత్రులను ఇన్చార్జులుగా సీఎం రేవంత్ నియమించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ పరిధిలో అడ్లూరి లక్ష్మణ్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్నారు. ఖమ్మం పరిధిలో తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పరిధిలో సుదర్శన్ రెడ్డికి పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. పోలీస్, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలన్నారు.
నెలాఖరుకల్లా క్రీడా పరికరాలు..
స్టేడియాల్లో అభివృద్ధి పనులు, 27 క్రీడలకు అవసరమైన క్రీడా పరికరాలు ఈ నెలాఖరుకల్లా సిద్ధంగా ఉంటాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే 14 స్టేడియాల్లో పనులు పూర్తవగా, మిగిలిన 6 చోట్ల నెలాఖరుకల్లా పూర్తి కానున్నాయన్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే కలెక్టర్లు క్రీడా క్యాంపులను, స్టేడియాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఖేలో ఇండియా పోటీల్లో 27 క్రీడల్లో పాల్గొనే 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కిట్లలో రెండు జతల ట్రాక్ సూట్లు, రెండు చొప్పున టీ-షర్టులు, షార్టులు, ఒక జత స్పోర్ట్స్ షూ, రెండు జతల సాక్క్సులు, రెండు జతల లోదుస్తులు, రెండు ట్రైనింగ్ టీ-షర్టులు ఇవ్వనున్నట్లు వివరించారు.
కాగా, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలో అత్యుత్తమ కోచ్‌లను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు చేపడుతున్న ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ కర్రసామును ఈ పోటీల్లో ప్రదర్శన క్రీడగా తొలిసారి ప్రవేశపెడుతున్నారు. దీంతో జాతీయ వేదికపై కర్రసాముకు సముచిత స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఈ క్రీడకు ప్రోత్సాహం అందుతుందని సీఎం అన్నారు. మరోవైపు నూతన క్రీడా విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులను ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా క్రీడలకు కొత్త ఊపిరి పోస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News