రెండోసారీ మొండిచెయ్యి
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:10 AM
పేదల సొంతింటి కల మరోసారి దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. హౌసింగ్ బోర్డు అధికారులు ఖైరతాబాద్ నియోజకవర్గానికి రెండో దశలోనూ మొండి చెయ్యి చూపించారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నాన్ లోకల్!
ఖైరతాబాద్‌లో 75 శాతం ఇళ్లు పక్క నియోజకవర్గాల వారికే సొంతం
370 ఇళ్లలో స్థానికులకు దక్కింది కేవలం 38 మాత్రమే
హైదరాబాద్: పేదల సొంతింటి కల మరోసారి దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. హౌసింగ్ బోర్డు అధికారులు ఖైరతాబాద్ నియోజకవర్గానికి రెండో దశలోనూ మొండి చెయ్యి చూపించారు. నియోజకవర్గంలో ఉండని వారికి ఇందిరమ్మ ఇళ్లు దక్కాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో తీసిన డ్రాలో 480 మంది ఇళ్లు, వెయిటింగ్ లిస్టులో మరో 120 మంది ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. డ్రాలో 177 మాత్రమే నియోజకవర్గానికి చెందిన లబ్ధ్దిదారుల పేర్లు వచ్చాయి. మిగతావన్నీ ఇతర నియోజకవర్గానికి చెందిన వారు ఎంపికయ్యారు. ఈ విషయంలో అప్పటి ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు స్థానిక పార్టీల నాయకులు హౌసింగ్ బోర్డు తీరుపై భగ్గుమన్నారు. కానీ, అధికారులు రెండోసారి కూడా తీరు మార్చుకోలేదు. 370 మందికి ఇళ్లు.. 150 మంది వెయిటింగ్ లిస్టు డ్రాను రెండు రోజుల క్రితం హౌసింగ్ బోర్డు నిర్వహించింది. ఈ డ్రాలో 75 శాతం నాన్‌లోకల్ వారికి ఇళ్లు దక్కాయి. దీంతో తమ పరిస్థితి ఏమిటని స్థానిక దరఖాస్తు దారుల్లో ఆవేదన మొదలైంది.
తొలి టోకెన్‌తోనే షాక్..
ఖైరతాబాద్ నియోజకవర్గంలో 4,632 మందిని అర్హులుగా తేల్చిన అధికారులు, మొదటి విడత కింద 600 మందికి లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, డ్రా ప్రారంభించి తీసిన మొదటి టోకెన్ సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి రావడంతో అక్కడున్న స్థానిక నేతలు, దరఖాస్తుదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వేరే నియోజకవర్గం వారికి ఇక్కడ ఎలా కేటాయిస్తారని అధికారులను నిలదీశారు. మొదటి టోకెన్ ఏదో పొరపాటున వచ్చిందని, మిగతావన్నీ ఖైరతాబాద్ వారికే వస్తాయని అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, డ్రా పూర్తయ్యేసరికి అధికారుల అసలు బండారం బయటపడింది. మొత్తం 600 ఇళ్లకు డ్రా తీయగా.. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన వారికి కేవలం 177 ఇళ్లు మాత్రమే దక్కాయి. హాల్ నుంచి బయటకు వచ్చిన లబ్ధిదారులను స్థానికులు ప్రశ్నించగా, మెజారిటీ లబ్ధ్దిదారులు ఇతర నియోజకవర్గం పేరు చెప్పారు. దరఖాస్తుదారులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. రెండో విడతలో తప్పులు దొర్లవని చెప్పిన అధికారులు మరోసారి ఇదే ధోరణితో వ్యవహరించారు. ఈ సారి ఏకంగా 75 శాతం ఇళ్లు పక్క నియోజకవర్గాలకు వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి.
క్యూర్.. మీ-సేవలో తప్పిదం!
ఈ గందరగోళానికి అధికారుల ప్రణాళికా లోపమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఖైరతాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్డునెంబర్.12 ఎమ్మెల్యే కాలనీ, హకీంపేట స్థలాల కేటాయింపు కోసం నోటిఫై చేశారు. అయితే, క్యూర్‌లో ఎమ్మెల్యే కాలనీ ప్రాంతాన్ని ‘జూబ్లీహిల్స్’గా పేర్కొనడంతో ఆ నియోజకవర్గం నుంచి భారీగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వాస్తవానికి స్థానికంగానే దరఖాస్తు చేసుకోవాలి. ఇలా నిబంధనలు చెబుతున్నప్పటికీ మీ-సేవా కేంద్రం నిర్వాహకులు మాత్రం దరఖాస్తు దారులు కోరిన చోట ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఆప్షన్స్‌లో జూబ్లీహిల్స్ అని కనిపించడంతో ఖరీదైన ప్రాంతమని నాంపల్లి, సనత్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోగా తమ నియోజకవర్గమే కదా అని జూబ్లీహిల్స్ వాసులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక నియోజకవర్గానికి చెందిన దరఖాస్తులను మరో నియోజకవర్గంలో అప్‌లోడ్ చేసినా, అధికారులు వాటిని కనీసం పరిశీలించకుండానే డ్రా జాబితాలోకి చేర్చారు. దీనిని బట్టి చూస్తే ఖైరతాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని నాయకులు భావిస్తున్నారు.
చిరునామా లేకుండా జాబితా...
గతంలో ఇళ్ల కేటాయింపు జరిగిన వెంటనే పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచే వారు. అంతేగాకుండా రాజకీయ పార్టీల నాయకులకు అందజేసే వారు. తాజాగా హౌసింగ్ బోర్డు అధికారులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త తరహా ప్రయత్నాలు ఆరంభించారు. లబ్ధ్దిదారుల వివరాలు ఆలస్యంగా వెబ్‌సైట్‌లో పెట్టినప్పటికీ పూర్తి చిరునామా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం ఎంపికైన లబ్ధ్దిదారుల దరఖాస్తు నెంబర్ వేసి చేతులు దులుపుకున్నారు. చిరునామా లేకుంటే అసలు విషయం ఎవరికీ తెలియదని అధికారులు భావించారు. కానీ, రెండో విడత అయ్యాక దరఖాస్తు జాబితాతో డ్రాలో ఎంపికైన వారి పేర్లను సరిచూడగా సుమారు 75 శాతం పేర్లు పక్క నియోజకవర్గానికి చెందిన వారివని తేలింది.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం
హౌసింగ్ బోర్డు మొదటి డ్రా సమయంలో అధికారులను హెచ్చరించాను. ఇతర నియోజకవర్గాలవి కాకుండా ఖైరతాబాద్ వారికే కేటాయించాలని చెప్పాను. అధికారులు తప్పును సరిచేసుకొని కొత్త జాబితా ఇస్తామన్నారు. మొదటి విడత అసలైన లబ్ధిదారుల ఎంపిక విషయంలో స్పష్టత రాకుండా రెండో విడత డ్రా నిర్వహించారు. ఇందులోనే నియోజకవర్గానికి చెందిన వారికి అన్యాయం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దరఖాస్తు దారులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా.
దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News