ఢిల్లీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ హతం
ABN , Publish Date - Nov 20 , 2026 | 07:58 AM
ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఢిల్లీ పోలీసుల బృందం, నోయిడా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఢిల్లీ పోలీసుల బృందం, నోయిడా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో మృతిచెందాడు. నవంబర్ 16న ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా కార్యాలయానికి సమీపంలో సమీర్ అనే యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన వ్యక్తులు సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సమీర్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ హత్య కేసులో నసీమ్ దురానీ ప్రమేయం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానించారు. హత్యకు నసీమ్ దురానీ, హరూన్ సైఫీ గ్యాంగుల మధ్య కొనసాగుతున్న గ్యాంగ్‌వారే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బులంద్‌షహర్‌లో నసీమ్ దురానీ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ పోలీసుల బృందం, నోయిడా ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఘటనాస్థలికి వెళ్లగా పోలీసులు, దురానీకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించారు.
కాగా, దురానీకి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడైన చోటా షకీల్‌తోనూ పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో తిహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను హత్య చేసేందుకు చోటా షకీల్.. దురానీకే బాధ్యతలు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ తెలిపితే రూ.1.63 కోట్లు..
మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు