గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ తెలిపితే రూ.1.63 కోట్లు..
ABN , Publish Date - Nov 20 , 2026 | 07:16 AM
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై కెనడా ప్రభుత్వం భారీ రివార్డును ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిపి, అరెస్టుకు సహకరించే వారికి గరిష్ఠంగా 2,50,000 కెనడియన్ డాలర్లు రివార్డుగా అందించనున్నట్లు వెల్లడించింది.
ఒట్టావా, నవంబర్ 20: సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై కెనడా ప్రభుత్వం భారీ రివార్డును ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిపి, అరెస్టుకు సహకరించే వారికి గరిష్ఠంగా 2,50,000 కెనడియన్ డాలర్లు (సుమారు రూ.1.63 కోట్లు) రివార్డుగా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కెనడాకు చెందిన బోలో (Be On the Lookout) తాజాగా విడుదల చేసిన 25 మంది మోస్ట్ వాంటెడ్ జాబితాలో గోల్డీ బ్రార్‌కు మొదటి స్థానం కల్పించింది.
కెనడాలోని విన్నిపెగ్ నగరంలో 2023 సెప్టెంబర్ 20న 39 ఏళ్ల సుఖ్దూల్ సింగ్ గిల్ అలియాస్ సుఖా దునేకే కాల్పుల్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి గోల్డీ బ్రార్‌పై కెనడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో అతడితో పాటు కరణ్‌బీర్ సింగ్‌పైనా చర్యలకు ఉపక్రమించారు. 2026 ఫిబ్రవరి 23న వీరిద్దరిపై ఫస్ట్-డిగ్రీ హత్య, హత్య కుట్రకు సంబంధించిన అభియోగాలతో అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే, ఇప్పటివరకు వీరిద్దరూ పోలీసులకు చిక్కలేదు. దీంతో తాజాగా మోస్ట్ వాంటెడ్ 25 జాబితాలో చేర్చారు.
మరోవైపు, గోల్డీ బ్రార్ కోసం కెనడాతో పాటు అమెరికా కూడా గాలిస్తోంది. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గత సెప్టెంబర్‌లో అతడిని తన టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్ జాబితాలో చేర్చింది. బ్రార్ ఆచూకీ తెలిపిన వారికి గరిష్ఠంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.8.9 కోట్లు) రివార్డుగా ప్రకటించింది. భారతదేశంలోనూ గోల్డీ బ్రార్‌పై పలు కేసులు ఉన్నాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.
ఎవరీ గోల్డీ బ్రార్?
గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్జీత్ సింగ్. పంజాబ్‌కు చెందిన గోల్డీ బ్రార్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. చండీగఢ్‌లో కళాశాల రోజుల్లోనే నేర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2017లో చదువు కోసం కెనడాకు వెళ్లిన అతడు, అక్కడి నుంచే పంజాబ్‌లో నేర కార్యకలాపాలు కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో కలిసి పనిచేసినట్లు, ఆ తర్వాత వారితో విభేదాలు వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ గోల్డీ బ్రార్ పేరు ప్రధానంగా వినిపించింది. ఈ కేసులో అతడిపై భారత దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి