అందరికీ ఇంధనం!
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:37 AM
ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రయోజనం కలిగేలా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంధన సరఫరా కొనసాగేలా చూడాలని అమెరికా, చైనా, రష్యా నిర్ణయించాయి
ప్రపంచంలో అవాంతరాలు లేకుండా చమురు సరఫరా
శుద్ధిచేసిన పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పెంచుతాం.. ప్రపంచానికి అణ్వాయుధ ముప్పునుతప్పిద్దాం
ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపడదాం.. అమెరికా, రష్యా, చైనా అధ్యక్షుల ఉమ్మడి ప్రకటన
అగ్రరాజ్యాలు యుద్ధాలు చేస్తే ప్రపంచం అల్లకల్లోలం: జిన్‌పింగ్.. ప్రపంచ శాంతి 3 దేశాల బాధ్యత:పుతిన్
చైనాలో ఏం జరుగుతుందో మాకు, అమెరికాలో ఏం జరుగుతుందో చైనాకు తెలుసు: ట్రంప్
అపెక్ సదస్సులో ముగ్గురు నేతల త్రైపాక్షిక చర్చలు.. చమురు సరఫరా పెంపుతో రష్యా, భారత్,చైనాకు లబ్ధి
షెంజెన్, నవంబరు 19: ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రయోజనం కలిగేలా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంధన సరఫరా కొనసాగేలా చూడాలని అమెరికా, చైనా, రష్యా నిర్ణయించాయి. చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి, సరఫరాను పెంచుతామని ప్రకటించాయి. ప్రపంచ శాంతి సుస్థిరతలను కాపాడే బాధ్యత తమపై ఉందని ఈ మూడు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో రష్యా చమురుపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది. దీనివల్ల రష్యాతోపాటు ఆ దేశ చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్, చైనా అధికంగా ప్రయోజనం పొందుతాయి. చైనాలోని షెంజెన్‌లో జరిగిన ఆసియా - పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్ (అపెక్) 33వ వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా ఈ ముగ్గురు అగ్ర రాజ్యాల అధినేతలు గురువారం త్రైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఉమ్మడిగా ‘ప్రపంచ శాంతి కోసం రష్యా, చైనా, అమెరికా అధినేతల ఉమ్మడి ప్రకటన’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
పుతిన్, ట్రంప్‌తో జిన్‌పింగ్ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. ఉమ్మడి ప్రకటనలో ప్రధానంగా ప్రపంచ శాంతి, అవాంతరాలు లేని ఇంధన సరఫరా, అణ్వాయుధాల నియంత్రణ, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలను ప్రస్తావించారు. ‘ఐక్యరాజ్య సమితి తన ప్రాథమిక లక్ష్యాలైన ప్రపంచ శాంతిభద్రతలను కాపాడటంలో మరింత సమర్థంగా పనిచేసేలా ఆ సంస్థలో అర్థవంతమైన సంస్కరణలు చేపట్టేందుకు.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా మేము కట్టుబడి ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగా కొనసాగేందుకు, అన్ని దేశాలకు ఉపయోగపడేలా శుద్ధిచేసిన పెట్రోలియం ఉత్పత్తుల తయారీ, సరఫరాను మరింత పెంచాలని తీర్మానించాం. అంతర్జాతీయ నేర న్యాయస్థానం.. అలాంటి ఇతర సంస్థలు తమ పరిధిని దాటి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తంచేస్తున్నాం. అణ్వాయుధాలతో జరిగే యుద్ధంలో గెలుపు అంటూ ఉండదు. అలాంటి యుద్ధాలు ఎట్టిపరిస్థితుల్లో జరగకూడదు. ప్రపంచానికి అణ్వాయుధ ముప్పును తప్పించేందుకు, అణ్వాయుధాల సంఖ్యను నియంత్రించేందుకు చర్చలు జరపాలని నిర్ణయించాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్చల్లో అణ్వాయుధాల నియంత్రణ అంశాన్ని ట్రంప్ ప్రధానంగా ప్రస్తావించారు. ‘మనం నిజంగానే చరిత్ర సృష్టిస్తున్నాం. భూమిపై అణ్వాయుధాల సంఖ్యను తగ్గించే అంశంపై చర్చల కోసం మన మూడు దేశాలు తమవైన విధానాలతో సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ‘అగ్రరాజ్యాల మధ్య స్నేహపూర్వక చర్చలు ఆప్షన్లా ఉండకూడదు. చర్చలు తప్పనిసరి అంశంగా ఉండాలి. అగ్రరాజ్యాలు యుద్ధం చేసుకుంటే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ప్రపంచ శాంతి సుస్థిరతలకు మన మూడు దేశాలు రక్షకులుగా ఉండాలి’ అని జిన్‌పింగ్ అన్నారు. ‘మన మూడు దేశాలు నిర్మాణాత్మక సహకారంతో మెలిగితే ప్రపంచం సుస్థిరంగా ఉంటుంది’ అని పుతిన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్