జేఎన్‌టీయూ అటానమస్ కాలేజీల్లో హాజరు దందా..
ABN , Publish Date - Nov 20 , 2026 | 08:15 AM
జేఎన్‌టీయూ పరిధిలోని ప్రైవేటు అటానమస్ కళాశాలల్లో ‘హాజరు’ దందా జోరందుకుంది.
రూ.5 వేలిస్తేనే అటానమస్ కాలేజీల్లో విద్యార్థికి అటెండెన్స్
హాల్‌టికెట్లను నిలిపివేస్తామని యాజమాన్యాల బెదిరింపు
కళాశాలలపై జేఎన్‌టీయూ పర్యవేక్షణ కరువు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ పరిధిలోని ప్రైవేటు అటానమస్ కళాశాలల్లో ‘హాజరు’ దందా జోరందుకుంది. బీటెక్ ఫస్టియర్ నుంచి ఫైనలియర్ వరకు సెమిస్టర్ పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండడంతో యాజమాన్యాలు అక్రమ వసూళ్లకు తెరలేపాయి. కళాశాలకు సరిగ్గా హాజరు కాని విద్యార్థుల నుంచే కాకుండా, రెగ్యులర్‌గా వచ్చే విద్యార్థుల నుంచి కూడా రూ.5వేల నుంచి 6వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినంత చెల్లించకుంటే అటెండెన్స్ తగ్గిన కారణంగా హాల్‌టికెట్లు నిలిపివేస్తామని బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 90శాతం హాజరు ఉన్న వారికి సైతం 60శాతమే ఉందని చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. యాజమాన్యాలే ఈ తరహా దందాకు పాల్పడుతుండడం గమనార్హం.
వసూళ్ల వెనుక రాజకీయం
జేఎన్‌టీయూలో రెండు మూడేళ్లుగా అటానమస్ కాలేజీల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. గతంలో పదేళ్ల పాటు ఎటువంటి రిమార్కు లేకుండా నడిచిన కళాశాలలకు మాత్రమే యూజీసీ అటానమస్ హోదా మంజూరు కోసం జేఎన్‌టీయూ అధికారులు సిఫారసు చేసేవారు. ఇటీవల యూజీసీ మార్గదర్శకాలను సడలించడం, జేఎన్‌టీయూ సిఫారసులు లేకున్నా అటానమస్ హోదాను మంజూరు చేస్తుండడంతో, సరైన ఫ్యాకల్టీగానీ, మౌలిక వసతులు కూడా లేని కాలేజీలు కూడా అటానమస్ హోదాను తెచ్చుకున్నాయి. కొన్ని కాలేజీలకు రాజకీయ నేతల అండ ఉండడంతో జేఎన్‌టీయూ అధికారులకు కూడా వాటిని నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. అటానమస్ హోదా ఉంటే.. సొంతంగా సిలబస్ ఎంచుకోవడం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం కూడా యాజమాన్యాల చేతుల్లోనే ఉండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన సేవలకు కూడా రేటు కట్టి తమను నిలువుదోపిడి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొరవడిన జేఎన్‌టీయూ పర్యవేక్షణ
అటానమస్ హోదా రాకముందు ప్రతీ ప్రైవేటు కళాశాలపైనా జేఎన్‌టీయూ పర్యవేక్షణ ఉండేది. విద్యార్థుల హాజరు, సిలబస్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం తదితర వ్యవహారాలన్నీ జేఎన్‌టీయూ అధికారుల పర్యవేక్షణలోనే జరిగేవి. అటానమస్ హోదా వచ్చాక అవే పనులన్నీ చేసుకుంటున్నాయి. విద్యార్థుల నుంచి ప్రతీ పనికి రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నాయి. అధికారులు తనిఖీకి వెళితే తమకు అటానమస్ హోదా ఉందని, తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో జేఎన్‌టీయూ అధికారులు ప్రైవేటు కళాశాలలపై నియంత్రణ కోల్పోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. హాజరు దందాపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై కఠిన చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఆయా కాలేజీలకు అటానమస్ హోదా రద్దు నిమిత్తం యూజీసీకి సిఫారసు చేయాలని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌కు బాధిత వర్గాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక్కడ వసూళ్లు ఇలా..
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన గ్రూప్ కళాశాలల్లో 4వేల మంది విద్యార్థులు ఉండగా, ఒక్కో విద్యార్థి నుంచి 5 వేల చొప్పున మొత్తం 2 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఏపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కళాశాలలోనూ అదే పరిస్థితి.
మైసమ్మగూడ ప్రాంతంలోని మాజీ మంత్రికి చెందిన గ్రూప్ కాలేజీల్లోనూ అటెండెన్స్ తక్కువ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నట్లు జేఎన్‌టీయూకు ఫిర్యాదులు అందాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News