Share News

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాన్ని తాకిన అక్వాన్ తుపాను బాహ్య వలయం

ABN , Publish Date - Nov 20 , 2026 | 08:43 AM

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను అక్వాన్ తుపాను బాహ్య వలయం తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో రెండు గంటల్లో తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాన్ని తాకిన అక్వాన్ తుపాను బాహ్య వలయం
Cyclone Akvan

అమరావతి, నవంబర్ 20: ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను అక్వాన్ తుపాను బాహ్య వలయం తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో రెండు గంటల్లో తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తీవ్ర తుపానుగా మారిన అక్వాన్ ప్రస్తుతం బలహీనపడి తుపానుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. గత ఆరు గంటల్లో గంటకు సగటున 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు. ప్రస్తుతం కళింగపట్నానికి 80 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 130 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 160 కిలోమీటర్లు, పూరీకి 220 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.


తుపాను దృష్ట్యా ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యవసర సమయాల్లో 1070, 112, 18004250101 నంబర్లతో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ 9552300009 ద్వారా సహాయం పొందాలని సూచించారు. ప్రజలు అధికారిక సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 13 తీర ప్రాంత మండలాల్లో విద్యాసంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. తుపాను పరిస్థితుల దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ, అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ అరాచకాలపై చర్యలు తీసుకోండి

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో మార్పు

Updated Date - Nov 20 , 2026 | 08:49 AM