భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ డిజిటల్ వ్యూహం
ABN , Publish Date - May 12 , 2026 | 09:59 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.
సిద్దిపేట, మే12 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన ఈరోజు (మంగళవారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, డిజిటల్ విధానాల అమలు వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
డిజిటల్ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయం..
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) చేపడుతున్న సర్ ప్రక్రియ, ఓటర్ లిస్టు సవరణ వంటి కార్యక్రమాలు పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని ఈ సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యవస్థను సాంకేతికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ నేతలు పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్తలు..
ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని ఈ సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం సమర్థవంతంగా సాగేందుకు మండలాలు, మున్సిపల్ బాడీల వారీగా ప్రత్యేక సభ్యత్వ సమన్వయ కమిటీలను రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
71 వేల మంది కార్యకర్తలకు శిక్షణ..
రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో డిజిటల్ సభ్యత్వ నమోదు నిర్వహించడానికి ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. డిజిటల్ మెంబర్‌షిప్ ప్రక్రియ, సాంకేతిక విధానాలు, సభ్యత్వ నమోదు యాప్ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు.
శిక్షణా శిబిరాల నిర్వహణ..
పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా శిబిరాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధినేత మార్గనిర్దేశం చేశారు.
పార్టీ బలోపేతంపై దృష్టి..
బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. డిజిటల్ వ్యవస్థ ద్వారా కార్యకర్తల డేటాబేస్‌ను పటిష్టం చేసి భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పర్యవేక్షణ కోసం కేసీఆర్ ఆయా జిల్లాల వారీగా కీలక నేతలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు - తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి
జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి.
మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు - గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు - గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు - నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు - రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు - సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు - మహ్మద్ అలీ, మాజీ మంత్రి
గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు - మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి
మేడ్చల్ - మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాలు - పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్
హైదరాబాద్ జిల్లా - తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
నల్గొండ, సూర్యాపేట జిల్లాలు - ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News