Share News

కాళేశ్వరంపై అసెంబ్లీ!

ABN , Publish Date - Nov 06 , 2026 | 03:10 AM

కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీల మరమ్మతులపై ఈ నెలాఖరులోగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సమగ్రంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో అన్నారు.

కాళేశ్వరంపై అసెంబ్లీ!
Uttam Kumar Reddy, Revanth Reddy, Bhatti Vikramarka

  • ఈ నెలలోనే రెండు రోజుల పాటు సమావేశాలు పెట్టి చర్చిద్దాం

  • ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం

  • మూడు బ్యారేజీల పరిస్థితి చెబుదాం

  • వాటి మరమ్మతు చర్యలను వివరిద్దాం

  • మూడేళ్లు ఎందుకు పట్టిందో కూడా చెప్పాలి

  • మంత్రులు గోదారి ప్రాజెక్టులు సందర్శించాలి

  • నీరు వృథా కావట్లేదని ప్రజలకు వివరించాలి

  • మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్‌

  • రూ.4193 కోట్లతో 3 బ్యారేజీల పునరుద్ధరణ

  • వచ్చే నెలలో మరమ్మతు పనులు ప్రారంభం

  • మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీల మరమ్మతులపై ఈ నెలాఖరులోగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సమగ్రంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో అన్నారు. గోదావరి నీళ్లను కన్నెపల్లి పంప్‌ హౌస్‌ ద్వారా ఎత్తిపోయకుండా ఆంధ్రాకు వదిలేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం క్యాబినెట్‌ భేటీకి ముందు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం.. రెండు రోజుల పాటు సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కాళేశ్వరం బ్యారేజీలపై సమీక్షించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు రూ.4193 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. డిసెంబరులో మరమ్మతులు ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం జరిగిన క్యాబినెట్‌ భేటీలోనూ ఈ అంశంపై చర్చించారు. ఎన్‌డీఎస్ఏ చెప్పినట్లు ప్రాజెక్టుకు అన్ని రిపేర్లు పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.


కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సభలో చర్చిద్దామని మంత్రులతో సీఎం అన్నారు. మూడు బ్యారేజీల పరిస్థితి ఏంటి? వాటిలో నీటిని నిల్వ చేస్తే తట్టుకునే పరిస్థితి ఉందా? ఎన్‌డీఎ్‌సఏ ఏం నివేదికలు ఇచ్చింది? మరమ్మతులకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుంది? అసలు మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందుకు మూడేళ్ల సమయం ఎందుకు పట్టింది? దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా గత ప్రభుత్వాల కంటే సమర్థవంతంగా నీటిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? ఈ వివరాలన్నీ సభలో చర్చిద్దామని చెప్పారు. ఈ అంశాలపై బీఆర్‌ఎస్‌ నేతలకూ మాట్లాడే అవకాశం ఇద్దామన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు, ఆ పార్టీ సోషల్‌ మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి అసెంబ్లీ వేదికగా ప్రజలకు సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు.


మరమ్మతులు చేయకుండా మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదని, అవి పని చేయకుండా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి కూడా లేదని సీఎం మంత్రులకు వివరించారు. ఇది తెలిసి కూడా బీఆర్‌ఎస్‌ నాయకత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వాస్తవాన్ని రైతులు, ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు ఆ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించాలని ఆదేశించారు. కాళేశ్వరానికి గుండెకాయ లాంటి మూడు బ్యారేజీలు పని చేయకున్నా గోదావరి నీటిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో ప్రజలకు చూపించాలని చెప్పారు. సందర్శనకు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులనూ తీసుకెళ్లాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క ఈ ప్రాజెక్టులను సందర్శించనున్నారు.


లోపాల సవరణ బాధ్యత నిర్మాణ సంస్థలదే

నిర్మాణపరమైన లోపాలను ఎల్‌ అండ్‌ టీ(మేడిగడ్డ), అఫ్కాన్స్‌(అన్నారం), నవయుగ(సుందిళ్ల) సంస్థలే సరి చేయాల్సి ఉంటుందని, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని సమీక్షలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్‌ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారం పునరుద్ధరణ పనులు చేపట్టి, దెబ్బతిన్న బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తేవాలని సీఎం నిర్దేశించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.


ప్రస్తుత పరిస్థితుల్లో లిఫ్ట్‌ సాధ్యం కాదు

బ్యారేజీలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కన్నెపల్లి(ప్రాణహిత) వద్ద కనిపించే నీటిని లిఫ్ట్‌ చేయడం సాధ్యం కాదని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ నుంచి లిఫ్ట్‌ చేసిన నీళ్లు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూయాల్సి ఉంటుందని అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. నిర్మాణ లోపాలున్న ఈ రెండు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని(ఫ్రీ ఫ్లో) జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎస్ఏ) సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నీళ్లున్నా లిఫ్ట్‌ చేయడం లేదన్న తప్పుడు ప్రచారాన్ని ఈ సమాచారంతో తిప్పికొట్టాలని సీఎం మంత్రులకు సూచించారు. మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత మూడు బ్యారేజీల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించినట్లు అధికారులు నివేదించారు. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్రం ఏర్పాటు చేసిన టెక్నికల్‌ ఓవర్‌ సైట్‌ కమిటీ ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వివరించారు.


గతంలో కన్నా మెరుగ్గా పంపింగ్‌

దిగువ గోదావరి నీరు వృథాగా పోకుండా జే చొక్కారావు దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిని లిఫ్ట్‌ చేసినట్లు సీఎం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీలు ఎత్తిపోస్తే.. ఈ మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీలు పంపింగ్‌ చేశామన్నారు. గతంతో పోలిస్తే ఇది 89 శాతం అధికమని తెలిపారు. అక్టోబరు నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు.. మొత్తం 24.81 టీఎంసీలు లిఫ్ట్‌ చేసి వినియోగించుకున్నామని చెప్పారు. ఆ నీటితో ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగు, తాగునీరు అందించామన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, వరి దిగుబడిలో దేశంలోనే రికార్డు సాధించామని సీఎం గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఉండేవి కావని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదని, కరెంట్‌ బిల్లుల భారం గణనీయంగా తగ్గేదని, ఎల్లంపల్లికి నీరు వచ్చేదని వివరించారు.


గత ప్రభుత్వ తప్పిదాల వల్లే కుంగుబాటు

గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందని సీఎం ఆరోపించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భద్రత విషయంలో రాజీ పడకుండా జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

నెలాఖరులోగా తుది అనుమతులు

పునరుద్ధరణ పనులకు తుది అనుమతులను ఈ నెలాఖరులోగా పొందేందుకు ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎ్‌సఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బ్యారేజీల నీటి వినియోగ సామర్థ్య పునరుద్ధరణ, రక్షణ పనులను రెండు దశలుగా విభజించుకోవాలని చెప్పారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. సమీక్షలో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌, టన్నెల్‌ అండ్‌ సేఫ్టీ కార్యదర్శి కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా తదితరులు పాల్గొన్నారు.


పారదర్శకంగా రిపేర్లు

ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై క్యాబినెట్‌ భేటీలో చర్చించారు. ఫౌండేషన్‌ లోపంతో పాటు కటాఫ్‌ వాల్స్‌ లోపం, డౌన్‌స్ట్రీమ్‌లో స్పిల్‌వేకు అవసరమైన వెడల్పు లేకపోవడం, అప్‌స్ట్రీమ్‌లో కటాఫ్‌ వాల్స్‌, డయాఫ్రం వాల్‌ ఏర్పాటు చేయకపోవడం వంటి లోపాలను ఎన్‌డీఎస్ఏ గుర్తించింది. ఈ లోపాల కారణంగా నీటిని నిల్వ చేయొద్దన్న ఎన్‌డీఎస్ఏ సిఫారసు మేరకు నిల్వ చేయలేదు. ఎన్‌డీఎస్ఏ చెప్పినట్లు పూర్తి వివరాలను సమర్పించి, ప్రాజెక్టును ఎలా వినియోగంలోకి తేవాలన్న దానిపై విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇప్పటికే పూర్తి వివరాలతో నివేదిక వచ్చింది. దీనిపై చర్చించిన క్యాబినెట్‌.. పారదర్శకంగా ప్రాజెక్టును రిపేర్‌ చేసి, ఉపయోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 03:50 AM