Share News

తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి చాటాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:12 AM

రాష్ట్ర ప్రతిష్ఠను, పారిశ్రామిక విజన్‌ను ప్రపంచానికి చాటిచెప్పేలా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గోబల్‌ సమ్మిట్‌-2026’ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి చాటాలి
Revanth Reddy

  • సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు

  • 15 నాటికి ఏర్పాట్ల ప్రణాళిక సిద్ధమవ్వాలి

  • అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

  • డిసెంబరు 7-9 వరకు ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ -2026

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రతిష్ఠను, పారిశ్రామిక విజన్‌ను ప్రపంచానికి చాటిచెప్పేలా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గోబల్‌ సమ్మిట్‌-2026’ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భారత్‌ ఫ్యూచర్‌సిటీలో డిసెంబరు 7 నుంచి 9 వరకు ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సచివాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక నవంబరు 15 నాటికి సిద్ధమవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సదస్సుకు విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.


ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని ఆదేశించారు. భద్రతకు సంబంధించివిభాగానికో భద్రతాధికారిని కేటాయించాలని సూచించారు. వేదిక వద్ద ప్రవేశం నుంచి తిరుగు ప్రయాణం వరకు ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. కాగా, గత ఏడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌ కంటే ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. గతంలో ఒక్క ఎక్స్‌పో హాల్‌ మాత్రమే ఉండగా.. ఈసారి ఏకంగా ఆరు భారీ ప్రదర్శనశాలలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మొత్తం 52 రంగాలపై 4 ప్రదాన హాళ్లలో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని తెలిపారు.


ఇందులో రక్షణ, ఏరోస్పేస్‌, రోబోటిక్స్‌ పరికరాలు, వైమానిక విన్యాసాలతో కూడిన రక్షా ఎక్స్‌ పో, గేమింగ్‌, యానిమేషన్‌ రంగాల సమాహారంగా ‘ఇండియా జాయ్‌-2026, 136 వినూత్న ప్రదర్శనలతో స్టార్టప్‌ పెవిలియన్‌, 60 ప్రముఖ కంపెనీలతో ఫార్మా అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎక్స్‌ పోలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, చేనేత, బతుకమ్మ, కాకతీయుల వైభవాన్ని చాటేలా తెలంగాణ పెవిలియన్‌, పర్యాటకరంగ ఆకర్షణలు, నర్సరీ నుంచి ఆక్స్‌ఫర్డ్‌ వరకు విద్యావికాసాన్ని ప్రతిబింబించే ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన సీఎం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలోని మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తుందని అన్నారు. అలాగే, ఈసారి ప్రదర్శనల్లో రక్షాఎక్స్‌పో ప్రధాన ఆకర్షణ కానుందని సీఎం చెప్పారు. ఇప్పటివరకు 49 రక్షణ సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయని సీఎం అన్నారు. అలాగే, ఎల్‌నినో ప్రభావం, కరువు, పరిస్థితులపై డిసెంబరు 8న నిర్వహించనున్న తెలంగాణ క్లైమేట్‌ కాంక్లేవ్‌ ఏర్పాట్లపైనా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 04:15 AM