మరో రెండు పథకాలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 03:32 AM
ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలో మరో రెండు పథకాలను అమల్లోకి తీసుకురానుంది.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం..
ఇందిరమ్మ చీరల పంపిణీ 19న ప్రారంభం
ఇందిరాగాంధీ జయంతి రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో లాంఛనంగా
మంత్రులకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ బాధ్యతలు
ఎస్సీలు, ఎస్టీలకు ఇక వేర్వేరుగా కమిషన్లు
కోర్టులకు 136 పోస్టుల మంజూరు
ఫైర్ సర్వీస్ యాక్ట్-1999’ సవరణ ఆర్డినెన్స్.. సర్వే సరిహద్దుల చట్టం-1923’కు సవరణ
భూభారతికి చట్ట సవరణ..
22ఏ అప్పీళ్ల గడువు తగ్గింపు
పురపాలక శాఖలో 886 పోస్టుల భర్తీ
రహదారుల కోసం రూ.3 వేల కోట్ల రుణం
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
మంత్రులు పొంగులేటి, వాకిటి, అడ్లూరి వెల్లడి
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలో మరో రెండు పథకాలను అమల్లోకి తీసుకురానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించింది. సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సభా వేదిక నుంచి వీటిని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా వర్తించేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని కూడా 19న ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం రాత్రి క్యాబినెట్ భేటీ జరిగింది. అనంతరం సమావేశ వివరాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాయి. తహసీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని స్వీకరిస్తారు. అనంతరం ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమాను వర్తింపజేస్తారు. కాగా, ఇందిరమ్మ చీరలను మొదటి విడత కింద ఇప్పటికే పంపిణీ చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. రెండో విడతను సిద్దిపేటలో లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు.
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుపై ప్రత్యేక చర్చ..
డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో నిర్వహించే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు సంబంధించిన అంశాలపై క్యాబినెట్ భేటీలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులు రానున్నారు. వీరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. సదస్సుకు సంబంధించి మంత్రులు, అధికారులకు ఒక్కో బాధ్యతను అప్పగించనున్నారు. వీటితోపాటు దీపావళి సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, సర్పంచులు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ అన్ని ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఉంటారు. 9న అక్కడ నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొంటారు. మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ఏర్పాటు చేస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
మంత్రివర్గం ఇతర నిర్ణయాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ‘తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్-2003’ను రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి కమిషన్‌లో చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు.
‘తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999’ సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారు.
‘తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం-1923’లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదనను ఆమోదించింది.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టు కోసం 56 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టుల్లో వివిధ విభాగాలకు మరో 80 పోస్టుల మంజూరును ఆమోదించింది.
రెవెన్యూ శాఖకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ప్రభుత్వ అవసరాల కోసం వివిధ శాఖలకు రెవెన్యూ భూములను బదిలీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) సవరణ చట్టం--2024ను తెలంగాణలో అమలు చేయాలని అటవీ శాఖ ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ క్యాటగిరీల్లో 886 పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంజినీర్ ఇన్ చీఫ్ (పబ్లిక్ హెల్త్), డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలో ఈ పోస్టులు ఉంటాయి.
తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఏర్పాటు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఆహార భద్రతా విభాగం, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ను ఒకే పరిపాలనా నియంత్రణ కిందకు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే 177 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకాలు, వారి సేవలకు ఉత్తర్వులు, మంజూరుకు కూడా ర్యాటిఫికేషన్ కోసం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హైదరాబాద్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో పీఎం ఏక్తా మాల్ (యూనిటీ మాల్) అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనపై చర్చించారు. 2026--27 ఆర్థిక సంవత్సరంలో నిధులు సమీకరించేందుకు టీజీఎస్ఐఐసీ రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ విషయాన్ని చర్చకు పెట్టారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలంలోని బురా?న్‌పూర్ గ్రామంలో సర్వే నంబర్ 96/పార్ట్‌లో ఉన్న 2.25 గుంటల ప్రభుత్వ భూమిని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు.ఈ భమి నాగార్జునసాగర్ ప్రాజెక్టు, నీటిపారుదల శాఖకు సంబంధించినదిగా అజెండాలో పేర్కొన్నారు. ఇందులో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్, హరేకృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. హనుమకొండలో ఇందిరమ్మ మహిళా డెయిరీకి దామెర గ్రామం లో సర్వే నంబర్ 393లో ఉన్న 10 గుంటల భూమిని కేటాయించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని సర్వే నంబర్ 107లో 19.12 గుంటల ప్రభుత్వ భూమిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట గ్రామం సర్వే నంబర్ 1228/1లో 19.01 ఎకరాల ప్రభుత్వ భూమిని విద్యాశాఖకు కేటాయించాలని ప్రతిపాదించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ సముదాయం నిర్మాణానికి ఈ కేటాయింపులు చేశారు. ఖమ్మం అర్బన్ మండలం నిజాంపేట గ్రామంలోని అబాది (గ్రామకంఠం) పరిధిలో 0.05 గుంటల ప్రభుత్వ భూమిని టీజీఎన్‌పీడీసీఎల్‌కు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ గ్రామం సర్వే నంబర్ 1392లో ఉన్న 1.22 ఎకరాల ప్రభుత్వ భూమిని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్‌కు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలోని ప్లాట్ నంబర్ 27, సర్వే నంబర్ 83/1లో ఉన్న 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదించారు.
1923 నాటి సర్వే అండ్ బౌండరీస్ చట్టంలోని సెక్షన్ 12, క్లాజ్ (బి)కు సవరణ చేయాలని క్యాబినెట్‌లో ప్రతిపాదించారు. సెక్షన్ 9(2) కింద జారీ చేసే నోటీసులపై అప్పీలు చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలనే ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ రుణ పరిమితిని రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచేందుకు గతంలో జారీ చేసిన జీవోఆర్‌టీ నంబర్ 111ను ర్యాటిఫై చేయాలని ప్రతిపాదించారు. హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News