Share News

80 వేల చదరపు మీటర్లలో సమ్మిట్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:14 AM

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

80 వేల చదరపు మీటర్లలో సమ్మిట్‌

  • దేశంలోనే అతిపెద్ద బహుళ-రంగ ప్రదర్శనగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’

  • 1000కిపైగా కంపెనీల ప్రతినిధుల రాక

  • రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్‌, తెలంగాణ పెవిలియన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

  • సమ్మిట్‌ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌ సమీక్ష

  • విద్యావేత్తలతో ప్రత్యేక చర్చల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ-రంగ ఎక్స్‌పోగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మిట్‌కు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వన రుల కేంద్రంలో మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి సమ్మిట్‌ ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోని యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్‌ ఏర్పాట్ల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్‌ వేదిక, వివిధ హాల్స్‌, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.


సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్‌, స్టార్టప్‌ పెవిలియన్‌, ఫార్మా అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్‌, ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పో, క్లైమేట్‌ కాంక్లేవ్‌ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల నుంచి 1000కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయని, ప్రతినిధులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని.. ప్రవేశాల కోసం ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) సాంకేతికతను వాడాలని సూచించారు. ఆహ్వానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతినిధులతో మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబుకు అప్పగించారు.


క్లైమేట్‌ కాంక్లేవ్‌లో సద్గురు వాసుదేవ్‌..

క్లైమేట్‌ కాంక్లేవ్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్‌, ఐరాస ప్రతినిధులు, నిపుణులు ప్రసంగించనున్నారు. స్థానికంగా ఉన్న ఇక్రిశాట్‌ వంటి సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, స్టార్ట్‌పలు, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయనున్నారు. ఎడ్యుకేషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా యూకే, యూరోపియన్‌ పెవిలియన్లతో పాటు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల ప్రదర్శనలు ఉండనున్నాయి. అలాగే ఇండియన్‌ స్కూల్‌ అఫ్‌ బిజినెస్‌, ఐఐటీ హైదరాబాద్‌, నల్సార్‌ యూనివర్సిటీ, హెచ్‌సీయూ సహా తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల ప్రతినిధులు అంతర్జాతీయ అతిథులతో మాట్లాడుకునే విధంగా స్టాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు.


సీఎం రేవంత్‌రెడ్డి 7న అంతర్జాతీయ విద్యావేత్తలు, నిపుణులతో ‘స్కూల్స్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంతో పాటు 8న ‘రీఫార్మ్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌’ అనే అంశంపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. ఇండియా జాయ్‌ కాంక్లేవ్‌లో భాగంగా దాదాపు 150 యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాల కంపెనీలు పాల్గొననున్నాయి. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1,500 మంది సీఈవోలు, ఎండీలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా మరో 1,500 మంది పరిశ్రమల వర్గాల ప్రతినిధులు రానున్నారు. సాధారణ పౌరులు, ఔత్సాహికులు సైతం గ్లోబల్‌ సమ్మిట్‌కు డిసెంబరు 10-13 తేదీల్లో వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


7న ప్రత్యేక కార్యక్రమాలు..

సమ్మిట్‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. రక్షా ఎక్స్‌పోలో భాగంగా 7న ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డేను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలపగా.. ఎయిర్‌ షో, ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని రేవంత్‌ సూచించారు. గిరిజన సదస్సులో భారత్‌తో పాటు వివిధ దేశాల బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 30 ఫుడ్‌ స్టాల్స్‌, చేనేత వస్త్రాల ప్రదర్శనకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్

వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు

ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:15 AM