Share News

ఆగని నీటి దందా

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:14 AM

వేసవిలో నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

ఆగని నీటి దందా

  • అక్రమంగా బోర్లు వేసి వ్యాపారం

  • పట్టించుకోని అధికారులు

  • రోజుకు రూ. 15 వేలపైనే సంపాదిస్తున్న వైనం

హైదరాబాద్: వేసవిలో నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మాదాపూర్‌ సున్నం చెరువు వద్ద కొంతమంది అక్రమంగా బోర్లు వేసి నీటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అక్రమ నీటి వ్యాపారం ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ(GHMC), జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదు. ట్యాంకర్ల యజమానులు ధనార్జనే ధ్యేయంగా నీటిని విక్రయిస్తున్నారు.

ఒక్కో ట్యాంకర్‌ ద్వారా రోజుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు సంపాదిస్తున్నారు. అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా నీటి వ్యాపారం ఆగడం లేదు. నీటి వ్యాపారాన్ని అరికట్టాలని పలువురు అధికారులను కోరుతున్నారు.


city5.jpgఎండ పెరుగుతున్న కొద్దీ ధరల పెరుగుదల

మాదాపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచే ట్యాంకర్ల అవసరం ఏర్పడుతుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ట్యాంకర్ల అవసరం రెండు, మూడింతలు పెరుగుతుంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు దర పెంచేస్తున్నారు. మార్చిలో 10,000 లీటర్ల ట్యాంకు రెండు నుంచి మూడు వేల రూపాయలు ఉంటుంది. జూన్‌కు వచ్చేసరికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారు.


రోడ్లపై వాటర్‌ ట్యాంకర్ల బారులు

బోరబండ సైట్‌-3 నుంచి మాదాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిలో వందల ట్యాంకర్లు రోడ్లపై బారులు తీరుతున్నాయి. బోర్ల నుంచి నీటిని నింపుకొని హాస్టళ్లు, హోటళ్లకు విక్రయిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోడ్డుకు అడ్డంగా ట్యాంకర్లను పార్క్‌ చేస్తుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నీటి సరఫరా పూర్తి కాగానే చిన్న రోడ్లపై ట్యాంకర్లను అక్రమంగా పార్క్‌ చేస్తున్నారు. సిద్ది వినాయకనగర్‌ వంటి ప్రాంతాల్లో పెద్ద ట్యాంకర్లను పార్క్‌ చేస్తుండటంతో ప్రయాణికులు, ఆ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కు చెందిన వాహనదారులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.


మోటార్లకు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించమన్నాం

అక్రమంగా నీటి విక్రయం తమ దృష్టికి వచ్చింది. నీటిని నిల్వ చేస్తున్న ట్యాంకర్లను ఒకసారి ధ్వంసం చేశాం. అయినా వారు తిరిగి నీటి విక్రయం కొనసాగిస్తున్నారు. మోటార్లకు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించమని ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం.

- బాలకృష్ణ, సర్కిల్‌-50 డీసీ


ట్యాంకర్లను సీజ్‌ చేస్తున్నాం

అక్రమంగా నీటిని తరలిస్తున్న వాటర్‌ ట్యాంకర్లను సీజ్‌ చేస్తున్నాం. కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రావడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం.

- శ్రీధర్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు రికవరీకి ఛాన్స్?

భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 24 , 2026 | 09:16 AM