బందో‘మస్త్’..శ్రీరామ నవమి శోభాయాత్రకు 3వేల మంది పోలీసులు
ABN , Publish Date - Mar 24 , 2026 | 07:42 AM
హైదరాబాద్ నగరంలో వైభవంగా జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ తెలిపారు.
సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా
రూట్‌ను పరిశీలించిన సజ్జనార్, కర్ణన్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలో వైభవంగా జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్(V.C. Sajjanar) తెలిపారు. సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌లో సోమవారం అన్ని శాఖల అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి సీపీ సజ్జనార్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తుపై సిబ్బందికి సీపీ దిశానిర్దేశం చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.
మధ్యాహ్నం ఒంటిగంటకల్లా..
శోభాయాత్రను మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. శబ్ధ కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
శోభాయాత్ర నిర్వాహకులు భగవంతరావు, గోవింద్ రాఠి, ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీమతి శశికల (మాజీ కార్పొరేటర్), లాల్ సింగ్ (మాజీ కార్పొరేటర్) తదితరులు కార్యక్రమం జరిగే సమయంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించారు. దీనిపై సీపీ స్పందిస్తూ అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శోభాయాత్ర వెళ్లే రూట్‌ను కర్ణన్‌తో కలిసి సీపీ పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఎన్. శ్వేత, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?
Read Latest Telangana News and National News