చెన్నై..అయ్యేనా సూపర్?
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:16 AM
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కున్న క్రేజ్ వేరు. ఎంఎస్ ధోనీ మాయాజాలంతో ఇతర జట్ల అభిమానులను కూడా సీఎ్‌సకే తమ వైపునకు తిప్పుకోగలదు. అంతేకాకుండా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత...
ఐపీఎల్ 4 రోజుల్లో
శాంసన్ రాకతో ఊపు యువ ఆటగాళ్లతో బరిలోకి
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కున్న క్రేజ్ వేరు. ఎంఎస్ ధోనీ మాయాజాలంతో ఇతర జట్ల అభిమానులను కూడా సీఎ్‌సకే తమ వైపునకు తిప్పుకోగలదు. అంతేకాకుండా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత ఈ జట్టు సొంతం. కానీ ఎన్నడూ లేని విధంగా గతేడాది చెత్త ఆటతీరుతో పదో స్థానంలో ఆఖరున నిలిచింది. ఈ దెబ్బకు జట్టు ప్రక్షాళనలో భాగంగా సీనియర్లను వదులుకుని కొత్త ముఖాలను వేలంలో కొనుగోలు చేసింది. ముఖ్యంగా ట్రేడింగ్‌లో జడేజాను రాజస్థాన్‌కు ఇచ్చి సంజూ శాంసన్‌ను తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే సామ్ కర్రాన్, దీపక్ హుడా, త్రిపాఠి, విజయ్ శంకర్‌లను పక్కనబెట్టింది. భవిష్యత్ ప్రస్థానాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టుకు యువరక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేసింది. అనూహ్యంగా 20 ఏళ్ల అన్‌క్యా్‌పడ్ ప్రశాంత్ వీర్, 19 ఏళ్ల కార్తీక్ శర్మలను రూ.14.20 కోట్ల చొప్పున వెచ్చించి డీల్ కుదుర్చుకుంది. ఇక యువ, సీనియర్ మేళవింపుతో ఆరో టైటిల్ కోసం బరిలోకి దిగాలనుకుంటోంది.
బలం
టీ20 వరల్డ్‌క్‌పలో అదరగొట్టిన సంజూ శాంసన్ ఈసారి జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ కానున్నాడు. అతడిపై ఆకాశాన్నంటే అంచనాలు ఉండగా, ఎంఎస్ వారసుడిగానూ భావిస్తున్నారు. ఇక ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఫామ్ కూడా అత్యంత కీలకం కానుంది. తను కూడా మెగా టోర్నీలో అదుర్స్ అనిపించుకున్నాడు. అలాగే చివరి సీజన్ మధ్యలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, బ్రెవిస్ అద్భుత ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. వీరి హిట్టింగ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. యువ ఆటగాళ్లు కార్తీక్, ప్రశాంత్ వీర్, సర్ఫరాజ్ అవకాశం ఇస్తే చెలరేగేందుకు సిద్ధంగా ఉంటారు. గాయంతో గత సీజన్ పూర్తిగా ఆడలేకపోయిన కెప్టెన్ రుతురాజ్ దేశవాళీల్లో ఫామ్ చాటుకోవడం సానుకూలాంశం కానుంది. యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ గత సీజన్‌లో జట్టుకు అండగా నిలిచాడు.
బలహీనత
జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ కాగా, వారికి ఐపీఎల్ అనుభవం అంతగా లేదు. అలాగే సీఎ్‌సకేలాంటి అపార అభిమానగణం ఉన్న జట్టు తరఫున ఆడనుండడంతో సహజంగానే వారిపై ఒత్తిడి నెలకొంటుంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ ప్రశాంత్, కార్తీక్‌లను అన్నేసి కోట్లు పెట్టి తీసుకోవడంతో మెరుగ్గా ఆడాలనే ఆందోళన వారి వెన్నంటే ఉంటుంది. ఇక వెటరన్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. అభిమానుల కోసమే తను చివర్లో వస్తున్నాడు. అలాగే జట్టు బౌలింగ్ విభాగంలో మ్యాచ్ విన్నర్లు కనిపించడం లేదు. ఖలీల్ అహ్మద్ పేస్ బాధ్యత తీసుకోనుండగా ముకేశ్ చౌధరి, గుర్జ్‌పనీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్ ఏమేరకు ప్రభావం చూపుతారో చూడాల్సిందే. విదేశీ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, అకీల్ హోస్సేన్ ఒవర్టన్, ఫౌక్స్ అందుబాటులో ఉండగా.. నాథన్ ఎలిస్ గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు.
జట్టు
స్వదేశీ ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ, రుతురాజ్ (కెప్టెన్), శాంసన్, శివం దూబే, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ముకేశ్ చౌధరి, గుర్జ్‌పనీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చాహర్.
విదేశీ ఆటగాళ్లు: బ్రెవిస్, నూర్ అహ్మద్, జేమీ ఒవర్టన్, అకీల్ హొసీన్, మ్యాట్ హెన్రీ, జాక్ ఫౌక్స్, మాథ్యూ షార్ట్.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం