Share News

కోర్టులంటే ప్రభుత్వాలకు చిన్నచూపు

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:32 AM

‘చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం లేదు. అసెంబ్లీ, పార్లమెంటులో కాంట్రాక్టర్లు, ధనవంతులు, మాఫియా లీడర్లే కనిపిస్తున్నారు. న్యాయస్థానాలంటే ప్రభుత్వాలకు చాలా చిన్న చూపు.

కోర్టులంటే ప్రభుత్వాలకు చిన్నచూపు

  • చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం లేదు

  • సభల నిండా కాంట్రాక్టర్లు, ధనవంతులు, మాఫియా లీడర్లే

  • సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

విజయవాడ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం లేదు. అసెంబ్లీ, పార్లమెంటులో కాంట్రాక్టర్లు, ధనవంతులు, మాఫియా లీడర్లే కనిపిస్తున్నారు. న్యాయస్థానాలంటే ప్రభుత్వాలకు చాలా చిన్న చూపు. వాటిని బలోపేతం చేద్దామన్న శ్రద్ధ లేదు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను నిర్వర్తించడం లేదు’’ అని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన బెజవాడ బార్‌ అసోసియేషన్‌ 120వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘ఎవరైనా జడ్జి పదవీ విరమణ చేస్తే పరమపదించినట్టు లెక్కేస్తున్నారు. పదవీ విరమణ చేసిన న్యాయాధికారులకు విలువ ఉండడం లేదు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించమని ప్రభుత్వాలను దేవురించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుండి నడిపించిన న్యాయవాద వ్యవస్థ ఇప్పుడు దురదృష్టకర పరిస్థితుల్లో ఉంది. చట్టాలపై చట్టసభల్లో ఎలాంటి చర్చలు జరగడం లేదు. లోపభూయిష్టంగా చట్టాలను రూపొందించి ఆమోదిస్తున్నారు. ఈ కారణంగానే న్యాయస్థానాల్లో కేసులు పెరిగిపోయాయి’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.


జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ మాట్లాడుతూ... ‘కృష్ణా జిల్లా కోర్టు 1930లో ఏర్పడింది. దాని పరిధి గంజాం నుంచి చిత్తూరు వరకు ఉండేది. ఆ కోర్టుకు నేను 99వ జడ్జిగా పనిచేశా. బెజబాడ బార్‌ దేశంలోని అన్ని బార్‌ల కంటే చాలా శక్తిమంతమైనది’ అని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ రవి మాట్లాడుతూ... ‘బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఎంతోమంది ప్రముఖులను సమాజానికి అందజేసింది. బార్‌ బలంగా ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ బలంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య మాట్లాడుతూ, తన తండ్రి విజయవాడలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్డి గోపి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాషా, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్‌, చలసాని అజయ్‌కుమార్‌, గంగాభవానీ, చిదంబరం, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్‌ రమణతోపాటు హైకోర్టు న్యాయమూర్తులను అసోసియేషన్‌ సభ్యులు సత్కరించారు.

Updated Date - Mar 24 , 2026 | 06:33 AM