Share News

భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:20 AM

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడా లేక రామనారాయణుడా అన్న వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సోమవారం హైకోర్టు పేర్కొంది.

భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?

  • హైకోర్టు వ్యాఖ్య .. విచారణ రేపటికి వాయిదా

  • గోత్రం, ప్రవరల మార్పిడిని సవాలు చేస్తూ వ్యాజ్యాలు

  • కొలువై ఉన్న స్వామి రామచంద్రుడా? రామనారాయణుడా?

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడా లేక రామనారాయణుడా అన్న వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సోమవారం హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఏర్పాటు చేసిన అయిదుగురు సభ్యుల నిపుణుల కమిటీ నివేదిక సమర్పించకుండా ఎలా విచారణ చేపట్టాలని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లకు సంబంధించిన విచారణార్హతను ముందుగా తేల్చాల్చి ఉంటుందని అభిప్రాయపడింది. భద్రాచల రాముని గోత్రం, ప్రవర మార్చడాన్ని సవాల్‌ చేస్తూ 2022లో దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని, కొంత సమయం కావాలని దేవాదాయ శాఖ న్యాయవాది భూక్యా మంగీలాల్‌ నాయక్‌ కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. భద్రాచలం ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, ఆలయ వ్యవస్థాపకుల ఉద్దేశం మేరకు పూజాదికాల నిర్వహణ జరిగేలా ఆదేశించాలని కోరారు. దాంతో పిటిషన్ల విచారణార్హతపై ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనల నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Updated Date - Mar 24 , 2026 | 06:20 AM