Share News

ఏడీజీ ఆదేశాలతోనే రఘురామపై దేశద్రోహం కేసు!

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:28 AM

నాటి సీఐడీ అదనపు డీజీ ఆదేశాల మేరకే అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు ఐజీ సునీల్‌ నాయక్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఏడీజీ ఆదేశాలతోనే రఘురామపై దేశద్రోహం కేసు!

  • రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణాధికారి ముందు సునీల్‌ నాయక్‌

గుంటూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): నాటి సీఐడీ అదనపు డీజీ ఆదేశాల మేరకే అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు ఐజీ సునీల్‌ నాయక్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. రఘురామను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడుగా(ఏ7) ఉన్న ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌ ఈ నెల 5 నుంచి 11 వరకు హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరులోని సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆయనను దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ విచారించారు. బిహార్‌ రాజధాని పట్నాలో ఉన్న తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఈ నెల 11న విచారణ ముగిసిన అనంతరం నేరుగా పట్నా వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆయన మరోసారి విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం నాటి విచారణలో ఈ కేసుకు సంబంధించి సునీల్‌ నాయక్‌ కీలక విషయాలు వెల్లడించారు.


విచారణాధికారి: ఎవరో వాట్సాప్లో మెసెజ్‌లు పెడితే వాటిని ఎఫ్ఎస్ఎల్‌కు పంపి అవి నకిలీవో, ఏఐ ఆధారితమైనవో, నిజమైనవో నిర్థారించుకోకుండా ఎఫ్‌ఐఆర్‌ ఎలా చేశారు?

సునీల్‌: రఘురామ నాటి ప్రభుత్వ పెద్దలను తిడుతున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని అప్పటి సీఐడీ అదనపు డీజీ ఆదేశించడంతోనే ఆ వీడియోను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్ఎస్ఎల్‌)కు పంపకుండానే కేసు నమోదు చేశాం.

విచారణాధికారి: నిర్థారించుకోకుండానే ఎఫ్‌ఐఆర్‌ చేయాల్సిన అవసరం ఏమిటి?

సునీల్‌: పోలీస్‌ శాఖలో మీకు తెలియనిది ఏముంది. పైఅధికారులు ఆదేశిస్తే చేయాల్సిందే. అందుకే దేశద్రోహం కేసు నమోదు చేశాం.

విచారణాధికారి: గంటలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. అరగంటలో అరెస్టు కోసం హైదరాబాద్‌ వెళ్లడం చూస్తుంటే.. ఇది కుట్రకోణంలో భాగం కాదా..? ఇందులో మీ పాత్ర ఏమిటి?.

సునీల్‌: ఈ విషయంలో నాకేమీ తెలీదు. అదనపు డీజీ చెప్పడంతో నేను కింది సాథయి అదికారులను ఆదేశించా. వారు ఆయన అరెస్టు కోసం ఏమైనా ఆదేశించారేమో నాకు తెలీదు.

విచారణాధికారి: ఆరోజు రాత్రి 10:30 గంటలకు రఘురామ నడుచుకుంటూ సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు. అర్ధరాత్రి 2 వరకు మీరు అక్కడే ఉన్నట్లు అంగీకరిస్తున్నారు. తర్వాత రోజు కోర్టుకు రఘురామ గాయాలతో నడవలేని స్థితిలో వచ్చారు. ఆ రాత్రి మీరేం చేశారు.? దగ్గరుండి కొట్టించారా?.

సునీల్‌: నేను కొట్టించలేదు.

విచారణాధికారి: మరి ఆ తర్వాత రోజు రఘురామ కాలికి గాయాలు ఉన్నట్లు సికింద్రాబాద్‌లోని మిలిటరీ హాస్పిటల్‌ నివేదిక ఇచ్చింది కదా. కనీసం ఆ రోజైనా మీరు దాని గురించి విచారించారా.?

సునీల్‌: (కొద్ది సేపు మౌనం).. ఆ మూడున్నర గంటల సమయంలో రఘురామ కొద్దిసేపు కూర్చున్నారు. ఆ తర్వాత పడుకున్నారు.

విచారణాధికారి: ఎంపీ కదా ఆయన అరెస్టు విషయం ముందుగా స్థానిక ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారా?.

సునీల్‌: ఎవరికీ చెప్పలేదు.


డ్రైవర్‌ వాంగ్మూలంపై మౌనం

రఘురామను సీఐడీ కార్యాలయంలో టార్చర్‌కు గురిచేసిన రోజు రాత్రి ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌ అక్కడే కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ రోజు సునీల్‌ కారు డ్రైవర్‌గా వచ్చిన పోలీసును పిలిపించి ఆయన ముందే ప్రశ్నలు వేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఆనాటి డ్రైవర్‌ చెప్పిన విషయాలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సునీల్‌ నీళ్లు నమిలినట్లు సమాచారం. ‘‘ఆనాడు మీ డ్రైవర్‌తో పాటు మీ వెంట వచ్చిన గన్‌మెన్లను కూడా పూర్తిగా విచారించి, వారి స్టేట్‌మెంట్స్‌ కూడా రికార్డు చేశాం’’ అని ఎస్పీ దామోదర్‌ చెప్పినట్లు తెలిసింది. దీంతో సునీల్‌ నాయక్‌ ఇబ్బంది పడినట్టు సమాచారం. కాగా.. తదుపరి విచారణ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌.. సునీల్‌కు చెప్పారు.

Updated Date - Mar 24 , 2026 | 06:30 AM