సర్.. వినిపించుకోరు..!
ABN , Publish Date - Sep 05 , 2026 | 10:25 AM
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎ్‌సఐఆర్) నగరంలో గాడి తప్పింది. భారీ స్థాయిలో ఓట్ల తొలగింపుపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న వేళ.. నోటీసుల జారీ, హియరింగ్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో గాడి తప్పిన ఎస్‌ఐఆర్ హియరింగ్
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు
క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఇబ్బందులు
అవగాహన కల్పించరు.. తెచ్చినవి తీసుకోరు
ఓ చోట ఉండే వారికి మరోచోట హియరింగ్
ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి
ఒక్కో ఓటర్‌కు 20 నుంచి 25 నిమిషాలు
గంటల తరబడి నిరీక్షణ.. తప్పని ఇబ్బందులు
కేంద్రాల వద్ద వసతులు కరువు
హైదరాబాద్ సిటీ: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎ్‌సఐఆర్) నగరంలో గాడి తప్పింది. భారీ స్థాయిలో ఓట్ల తొలగింపుపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న వేళ.. నోటీసుల జారీ, హియరింగ్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు నోటీసులిస్తున్న ఎన్యుమరేటర్లు.. ఏ డాక్యుమెంట్లు సమర్పించాలనే దానిపై వారికి సరైన మార్గనిర్దేశనం చేయడం లేదు. దీంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. హియరింగ్ నిర్వహిస్తున్న కేంద్రాలకు మూడు, నాలుగు పర్యాయాలు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ హియరింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్పగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
అక్కడకు రండి..
ఓటర్లు ఉండే చోటు నుంచి నాలుగైదు కిలోమీటర్లు, కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ దూరం రావాలని సూచిస్తున్నారు. కూలి పనులు, ఉద్యోగాలు చేసే వారికి ఇది ఇబ్బందికరంగా మారుతోంది. అంత దూరం వయోధికులు వెళ్లడం/తీసుకెళ్లడంలోనూ అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో 12.54 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. వాస్తవంగా 17వ తేదీ నుంచి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా.. వారం రోజుల తరువాత ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేటర్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా.. ఓటర్లను తమ వద్దకే రప్పించుకుంటున్నారు. హియరింగ్ జరిగే చోట ఉండాల్సి వస్తోందని, అందుకే ఓటర్లను రావాలని కోరుతున్నామని జూబ్లీహిల్స్‌లో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)గా విధులు నిర్వర్తిస్తోన్న జీహెచ్‌ఎంసీ నాలుగో తరగతి ఉద్యోగి ఒకరు తెలిపారు.
ఒక్కొక్కరికి 20 నిమిషాలకుపైగా..
హియరింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. కొన్ని కేంద్రాల వద్ద మూడు, నాలుగు గంటలు వేచి చూడాల్సి వస్తుండడం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులు/డాక్యుమెంట్లలో ఏవైనా రెండు లేదా మూడు తీసుకురావాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఓటర్ పుట్టిన తేదీని బట్టి ఎన్ని డాక్యుమెంట్లు సమర్పించాలన్నది నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎన్యుమరేటర్లు నోటీసులు ఇచ్చే సమయంలో స్పష్టంగా చెప్పడం లేదు.
నోటీస్ వెనుక భాగంలో ఈ వివరాలు ఉన్నప్పటికీ.. కొందరికి ఆ విషయం అర్థం కావడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న ఒకటి, రెండు డాక్యుమెంట్లు ఓటర్లు తీసుకెళ్తున్నారు. తీరా కేంద్రానికి వెళ్లాక తిప్పి పంపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓటర్లు తెచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించి అప్‌లోడ్ చేస్తున్నారు. ఒక్కో ఓటర్‌తో సంబంధిత ఎన్యుమరేటర్ ఫొటో దిగి ఎన్నికల సంఘం యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓటర్లు నోటీసులు పట్టుకున్న ఫొటోలూ అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. దీంతో ఓటర్లు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు...
Read Latest AP News And Telangana News And International News And Telugu News