Share News

పాతబస్తీ మెట్రోపై సీఎం స్పెషల్‌ ఫోకస్‌

ABN , Publish Date - Sep 05 , 2026 | 09:39 AM

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ మెట్రో కారిడార్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

పాతబస్తీ మెట్రోపై సీఎం స్పెషల్‌ ఫోకస్‌
Old City Metro, CM Revanth Reddy

  • పనులను త్వరగా చేపట్టేందుకు ఆసక్తి

  • కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ ఆమోదిస్తే ముందుకు

  • సీఎం ప్రకటనతో ఓల్డ్‌సిటీ ప్రాంతవాసుల్లో సంతోషం

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని పాతబస్తీ మెట్రో కారిడార్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని చారిత్రక ప్రాంతానికి మెట్రోరైలును వీలైనంత త్వరగా తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మెట్రోలోనే ఓల్డ్‌సిటీకి వచ్చి ఇక్కడి ప్రజలను ఓట్లు అడుగుతానని గురువారం స్టీల్‌బ్రిడ్జి ప్రారంభం సందర్భంగా సైదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో పాతబస్తీ ప్రాంతవాసులు సంతోషపడుతున్నారు.


city4.3.jpgఏళ్ల తరబడి మెట్రో కోసం ఎదురుచూస్తున్న తమ కల త్వరలో నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2023లో రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తొలి రోజుల్లోనే హైదరాబాద్‌ నగరంలో మెట్రో విస్తరణను చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా నగరం నలుమూలలకు మెట్రో రైలును తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలతో మొదటి దశలో మిగిలిన ఓల్డ్‌సిటీ కారిడార్‌తోపాటు ప్రత్యేకంగా నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మార్గాన్ని ప్రతిపాదించారు.


అలాగే ఎల్‌బీ నగర్‌ - హయత్‌నగర్‌, రాయదుర్గం-కోకాపేట్‌ నియోపోలీస్‌, మియాపూర్‌ - పటాన్‌చెరు, జేబీఎస్-మేడ్చల్‌, జేబీఎస్-శామీర్‌పేట్‌, ఎయిర్‌పోర్టు-భారత్‌ ఫ్యూచర్‌సిటీ కారిడార్లను కూడా డీపీఆర్‌లో పొందుపరిచారు. అయితే ఇందులో ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్‌సిటీ కారిడార్‌ను కొద్దిరోజుల క్రితం మూడో దశలో చేర్చారు. ప్రస్తుతం రెండో దశలో పార్ట్‌-ఏ కింద 7 కారిడార్లలో 122.9 కి.మీ. చేపట్టాలని కాంగ్రెస్‌ సర్కార్‌ భావిస్తోంది. ఈ మేరకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయాన్ని రూపొందించారు.


కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి

వాస్తవంగా రెండో దశలో ప్రతిపాదించిన 7 కారిడార్ల డీపీఆర్‌లను కేంద్రం అనుమతి కోసం 2024 నవంబర్‌ 4న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు ఢిల్లీకి పంపించారు. ఇదే క్రమంలో సెకండ్‌ ఫేజ్‌ నిర్మాణానికి అడ్డుగా ఉన్న మొదటిదశ టేకోవర్‌కు కూడా చర్యలు తీసుకున్నారు. రూ.15వేల కోట్లతో ఎల్‌అండ్‌టీ నుంచి ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.


city4.2.jpgఇందులో భాగంగా రూ.1400 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి చెల్లించి, మిగతా రూ.13,600 కోట్ల రుణ సాయాన్ని ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి తీసుకోవాలని భావించింది. అయితే గత జూన్‌లో రుణసాయం చేయాల్సిన ఐఆర్‌ఎ్‌ఫసీ చివరి నిమిషంలో చేతులెత్తయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు కన్సల్టెన్సీగా ఎస్‌బీఐ క్యాప్స్‌ సంస్థను నియమించింది. సదరు కంపెనీ రుణాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.


సొంతంగానైనా చేపట్టాలని..

రెండో దశ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 7 కారిడార్లకు రూ.38,595 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్రం వాటా 17 శాతం (రూ.6,666 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వ వాటా 31 శాతం (రూ.11,933 కోట్లు), బ్యాంకుల రుణాలు 52 శాతం (రూ.19,996 కోట్లు) ఉన్నాయి. అయితే డీపీఆర్‌లకు అనుమతి ఇచ్చిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలలో ఏమైనా జాప్యం జరిగినా తామే సొంతంగా పూర్తి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా శరవేగంతో పనులను పూర్తి చేసి అక్కడి ప్రజలను ఓట్లు అడగాలని చూస్తుండడం ఆసక్తికరంగా మారింది.


అనుమతి వస్తే..

రెండో దశలో ప్రతిపాదించిన 7 కారిడార్లకు కేంద్రం నుంచి అనుమతి రాగానే అందులో తొలుత ఓల్డ్‌సిటీ పనులను ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ మార్గంలోని పనులకు రెండేళ్ల క్రితమే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు మొత్తం 888 ఆస్తుల సేకరణలో ఇప్పటివరకు 833 ఆస్తులను అధికారులు తీసుకున్నారు. మిగతా 55 ఆస్తులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే పనులను మొదలు పెట్టాలని చూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మట్టి గణపతులకు ధర నిర్ణయం

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 10:25 AM