వ్యాపారి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. రూ. కోటిన్నర ఇచ్చి విడిపించారా..?
ABN , Publish Date - Oct 12 , 2026 | 08:41 AM
హైదరాబాద్ చిక్కడపల్లి బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు కోటిన్నర రూపాయలు ఇచ్చి ఆయనను విడిపించుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ చిక్కడపల్లి బంగారం వ్యాపారి శ్రీనివాసరావును ఈనెల (అక్టోబరు) 5వ తేదీన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. రామంతపూర్‌లోని తన బంగారం షాపు నుంచి వ్యాపారిని తీసుకెళ్లారు. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బులను ఇచ్చి శ్రీనివాసరావును కుటుంబ సభ్యులు విడిపించుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కాగా, కిడ్నాపర్లకు వ్యాపారి కుటుంబ సభ్యులు మొత్తంగా కోటిన్నర రూపాయలు ఇచ్చినట్లుగా సమాచారం. అయితే, కిడ్నాపర్ల చెర నుంచి తనంతట తానే బయటపడినట్లుగా పోలీసులకు శ్రీనివాసరావు అబద్ధం చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసు విషయంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో వేగం పెంచిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాసరావును ఏడుగురు ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారని గుర్తించారు. ఈ ఏడుగురిలో ఆరుగురిని సాంకేతిక ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులను కిడ్నాపర్లు తొలుత కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో 6వ తేదీ ఉదయం ఆ నగదుతో కాళీమాత ఆలయం వద్దకు రావాలని కిడ్నాపర్లు సూచించారు. ఆరోతేదీ తెల్లవారుజామున రూ.70 లక్షల తీసుకొని కాళీమందిర్ దగ్గరకు శ్రీనివాసరావు భార్య వెళ్లారు. ఆమె వెనకనే పోలీసులు ఉన్నారని గుర్తించి వ్యాపారిని తమతో తీసుకుని కిడ్నాపర్లు పరారయ్యారు. తమ లొకేషన్‌ను పోలీసులు గుర్తించకుండా కిడ్నాపర్లు వర్చువల్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. రేపు (మంగళవారం) నిందితులను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిబ్బందికి ప్రమాదం
యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News