Share News

పెన్ను ఖరీదు..రూ.7.80 లక్షలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:45 AM

పెన్నుతో అవసరం లేని ఆధునిక కాలమిది. ప్రియురాలికి ప్రేమలేఖ అయినా, క్లాస్‌రూమ్‌లో నోట్స్‌ అయినా అంతా... డిజిటల్‌ అంటోన్న యుగం. పెన్నులకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో ‘హెదరాబాద్‌ పెన్‌ షో-2026’ ఆకట్టుకుంటోంది.

పెన్ను ఖరీదు..రూ.7.80 లక్షలు
Hyderabad Pen Show

  • ఆకట్టుకుంటున్న హైదరాబాద్‌ పెన్‌ షో 2026

  • ఫౌంటెన్‌ పెన్నులు సొంతం చేసుకోవడానికి సందర్శకుల ఆసక్తి

హైదరాబాద్‌ సిటీ: పెన్నుతో అవసరం లేని ఆధునిక కాలమిది. ప్రియురాలికి ప్రేమలేఖ అయినా, క్లాస్‌రూమ్‌లో నోట్స్‌ అయినా అంతా... డిజిటల్‌ అంటోన్న యుగం. పెన్నులకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో ‘హెదరాబాద్‌ పెన్‌ షో-2026’ ఆకట్టుకుంటోంది. శుక్రవారం రెడ్‌హిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ రూపాల పెన్నులను ప్రదర్శనలో ఉంచారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన 24కు పైగా పెన్నుల తయారీదారులు, ఇంక్‌ల రూపకర్తలు ఇక్కడ తమ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో మూడు రోజుల పాటు ప్రదర్శన జరగనుంది. విభిన్న రకాల పెన్నులను చూడటం మాత్రమే కాదు, వాటి పనితీరు తెలుసుకుని, అనుభవాలను సొంతం చేసుకోవచ్చిక్కడ. రూ.50 నుంచి మొదలుకొని రూ.7.80 లక్షల విలువైన పెన్నులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.


విభిన్న అనుభూతులు

బాల్‌ పాయింట్‌ పెన్‌తో రాస్తే అక్షరాలు వస్తాయి. కానీ, ఫౌంటెన్‌ పెన్‌తో రాస్తే, ఆ రాసే విధానమే ఓ అనుభూతిగా మారుతుందంటున్నారు హైదరాబాద్‌ పెన్‌ షో నిర్వాహకులలో ఒకరైన కృష్ణ మోహన్‌. ఫౌంటెన్‌ పెన్‌కు ఇప్పటికీ అభిమానులున్నారనే ఆయన, నిబ్‌ పరిమాణం మారితే అక్షరాల రూపం మారుతుందంటున్నారు. దాదాపు 900కు పైగా రకాల సిరాలు ఇప్పుడు ప్రపంచంలో లభ్యమవుతున్నాయి. మన నగరంలో పెన్‌ షో చేయడం ఇదే తొలిసారన్న ఆయన చెన్నై, కోల్‌కతా లాంటి చోట్ల భారీస్థాయిలో ఈ ప్రదర్శనలను చేస్తుంటారని వివరించారు. ఈ ప్రదర్శనలో లిమిటెడ్‌ ఎడిషన్‌ కలెక్షన్‌లు, గేదె కొమ్ములు, కాంక్రీట్‌తో పోత పోసిన పెన్నులు లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకో విశేషమేమిటంటే, ఇక్కడ ప్రదర్శితమవుతున్న పెన్నులలో అత్యధిక శాతం చేతితో తయారుచేసినవే!


city7.jpgఈ పెన్నులు అ‘ధర’హో

పూణెకు చెందిన ఉరుషి స్టూడియో ఇండియా ప్రత్యేకంగా ఫౌంటెన్‌ పెన్నులను రూపొందించింది. స్వయంవరంలో ద్రౌపదిని మనువాడటానికి అర్జునుడు మత్స్యయంత్రం ఎలా ఛేదించాడనేది మన అరచేతిలోనే చూడొచ్చు. బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి తొక్కేయడం కాదంటే సంత్‌ జ్ఞానేశ్వర్‌, సంగ్‌ దేవ్‌ మహారాజ్‌ జ్ఞానామృతం విశేషాలను ప్రత్యేకంగా పెన్నులుగా రూపొందించారు.


రాగి, ఎబోనైట్‌, వెండి, బంగారం, ప్లాటినమ్‌ లాంటి మెటీరియల్స్‌ వీటి తయారీలో వాడారు. వీటి ధరలు రూ.7.50 లక్షలుగా ఉంటాయని ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన వివేక్‌ కులకర్ణి తెలిపారు. లిమిటెడ్‌ ఎడిషన్‌లో 48 వజ్రాలతో, 18 క్యారెట్ల గోల్డ్‌ నిబ్‌తో జర్మనీకి చెందిన స్టెడ్లర్‌ ప్రీమియం రూపొందించిన పెన్ను ధర అక్షరాల రూ.7.80 లక్షలు. మరో మోడల్‌లో కింగ్‌ లూయిస్‌ 14, మ్యుజిషియన్‌ రిచర్డ్‌ వాగ్నర్‌, జర్మన్‌ పెయింటర్‌ అలబ్రెక్‌ వంటి వారు ఉంటారు. దీని విలువ రూ.81 వేల నుంచి రూ.99 వేలు.


ఈ వార్తలు కూడా చదవండి:

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర

చార్మినార్‌పై పనిచేయని గడియారం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 11:31 AM