మా ఇళ్లల్లో బోర్లు ఎండిపోతున్నాయి..!
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:25 AM
అక్రమ బోర్లు.. నీటి దందాపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలు కాలనీలు, బస్తీల ప్రజలు బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
నీటి దందాపై హైడ్రాకు ఫిర్యాదులు
క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్ సిటీ: అక్రమ బోర్లు.. నీటి దందాపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలు కాలనీలు, బస్తీల ప్రజలు బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్ల ఆక్రమణలపై ఫిర్యాదులు రాగా.. ప్రస్తుతం అక్రమ నీటి దందాను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. తమ ప్రాంతంలో అక్రమ బోరు నీటి వ్యాపారంతో ఇళ్లలోని బోర్లు ఎండిపోతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు.
సాధారణంగా నివాసాల్లో అక్కడి భూగర్భ జలాల స్థాయిని బట్టి 200 నుంచి 1000 అడుగుల వరకు.. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. అదే ఏరియాలో నీటి దందా కోసం వేస్తున్న బోర్లు.. ఇళ్లలోని బోర్ల కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ లోతు ఉంటున్నాయి. ట్యాంకర్ల ద్వారా విక్రయించే ఈ బోర్ల ద్వారా నీటి వాడకమూ అధికమే. కొందరి అక్రమ దందాతో తాము నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వాటిని నియంత్రించాలని పౌరులు కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువస్తున్నారు.
ఇటీవల గాజుల రామారానికి చెందిన దాదాపు 50 మంది హైడ్రా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు.. అక్రమ బోర్లు, నీటి వ్యాపారాన్ని నిర్ధారించుకొని చర్యలు చేపట్టారు. ఫాక్స్ సాగర్ వద్ద ఏడు బోర్లు తొలగించారు. సున్నం చెరువు వద్దా ఇదే పరిస్థితి. తమ్మిడికుంటలోనూ ప్రజలు ఫిర్యాదు మేరకు బోర్లు తొలగించినట్టు హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి. రెవెన్యూ విభాగం అధికారుల విజ్ఞప్తి మేరకు కొన్ని చోట్ల బోర్లు తొలగిస్తున్నట్టు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వీబీజీరామ్‌జీ ఉపాధి పనుల్లో ముందంజ
Read Latest AP News And Telangana News And International News And Telugu News