మా అభ్యర్థులకు మద్దతివ్వండి
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:28 AM
రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాల్సిందిగా సీపీఐ, టీజేఎస్ పార్టీలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ, టీజేఎస్ మద్దతు కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
సానుకూలంగా స్పందించిన కోదండరాం, కూనంనేని
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాల్సిందిగా సీపీఐ, టీజేఎస్ పార్టీలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం బోధి పెవిలియన్‌లో ఇరు పార్టీల నాయకత్వాలతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో సామ రామ్మోహన్‌రెడ్డికి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. రేవంత్‌రెడ్డి ప్రతిపాదన పట్ల టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇరు పార్టీలూ ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గాల్లో చర్చించి మద్దతుపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పినట్లు పేర్కొన్నాయి.
కాగా, సీఎంతో భేటీలో ఇరు పార్టీల నేతలు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుకు మాత్రమే పరిమితం కాకుండా.. ఎల్‌నినో, రైతులు, నిరుద్యోగులు, గిరిజనులు తదితర వర్గాల సమస్యలపై చర్చించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు వేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. అలాగే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలన్నారు. రైతు బీమా, రైల్వే ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. నామినేటెడ్ పోస్టులపైనా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. కరువు పరిస్థితులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీకి ఆరుతడి పంటలకు ప్రోత్సాహకాలతోపాటు ఇతర సూచనలూ ఇవ్వాలని కోదండరాంను కోరారు. ఉద్యోగ ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. భూమిలేని రైతాంగానికీ బీమా వర్తించేలా కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు రూ.లక్ష కోట్ల దాకా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News