Share News

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:09 AM

తీవ్ర తుఫాను ‘మురసు’ ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాను అతలాకుతలం చేసి.. ఒంగోలు సమీపంలో మంగళవారం ఉదయం తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 100-125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీశాయి.

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Cyclone Murasu

  • ఏపీలోని దక్షిణ కోస్తా తీరంలో బీభత్సం..

  • నేలకొరిగిన వృక్షాలు, కరెంటు స్తంభాలు

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

  • పత్తి, వరి పంటలకు నష్టం

  • నేడు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తీవ్ర తుఫాను ‘మురసు’ ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాను అతలాకుతలం చేసి.. ఒంగోలు సమీపంలో మంగళవారం ఉదయం తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 100-125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీశాయి. గాలుల తీవ్రతకు వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాలు చిగురుటాకులా వణికాయి. మచిలీపట్నం, బాపట్ల, చీరాల, ఒంగోలు తీరం వెంబడి ‘మురసు’ బీభత్సం సృష్టించింది. పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు కుండపోతగా వర్షాలు కురిశాయి. విజయవాడ, గుంటూరు నగరాలను చిమ్మచీకట్లు కమ్మేశాయి. రోజుంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పల్నాడు జిల్లా మర్రిపాలెంలో అత్యధికంగా 26.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీరం దాటిన తర్వాత మురసు క్రమంగా బలహీనపడి తుఫానుగా మారి.. మంగళవారం బాపట్లకు 40 కిలోమీటర్లు, విజయవాడకు నైరుతిగా 80-92 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.


ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి మంగళవారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కోస్తా జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు మురసు ప్రభావంతో బుధవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీగా.. కొన్నిచోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. వేంసూరులో అత్యధికంగా 5.23 సెం.మీ, సత్తుపల్లిలో 4.30, భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేటలో 5.6 సెం.మీ., దమ్మపేటలో 5.20, అన్నపురెడ్డిపల్లిలో 3.30 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. పలు మండలాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.


ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లతో తుమ్మల సమీక్ష

మురసు ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్‌ నుంచి ఆయన మంగళవారం ఇరు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మురసు ప్రభావం విమాన, రైలు సేవలపై తీవ్రంగా పడింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విజయవాడ, రాజమండ్రికి, అక్కడి నుంచి శంషాబాద్‌కు నడవాల్సిన 16 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.


రద్దయిన రైళ్లు ఇవే..

భారీవర్షాల కారణంగా ట్రాక్‌లపై వరదనీరు పొంగిపొర్లుతుండడంతో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మంగళవారం బయల్దేరాల్సిన రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. శబరి ఎక్స్‌ప్రెస్‌, సింహపురి ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు రావాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, లింగంపల్లి-నర్సపూర్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌-తిరుపతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సలు రద్దయ్యాయి. తిరుపతి- అదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-లక్నో, మధురై-నిజాముద్దీన్‌ రైళ్లను దారిమళ్లించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జీహెచ్‌ఎంసీలో ‘అవినీతి’ చేప

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంపు

‘క్యూర్‌’లో అంధకారానికి చెక్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 04:11 AM