జీహెచ్‌ఎంసీలో ‘అవినీతి’ చేప
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:57 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో మెప్మా అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
అక్రమాస్తుల కేసులో పేదరిక నిర్మూలన సంస్థ ఏడీ యాదగిరిరావు అరెస్టు
హైదరాబాద్ సహా 10 చోట్ల ఏసీబీ సోదాలు..
4.75 కోట్ల ఆస్తుల గుర్తింపు
మార్కెట్‌లో వాటి విలువ భారీగా.. 1.7 కిలోల పసిడి, 3 కిలోల వెండి
ఉప్పల్, సూర్యాపేటల్లో ఇళ్లు, వాణిజ్య భవనాలు..
73 లక్షల విలువైన కార్లు
రూ. 36 లక్షల విలువైన ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు
హైదరాబాద్/ ఉప్పల్/ సూర్యాపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో మెప్మా అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి యాదగిరిరావు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తమ సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా యాదగిరి రావుకు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.4.75 కోట్ల విలువైన చిర, స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేటల్లో రూ.58.63 లక్షల విలువైన 12 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయి.
హైదరాబాద్, ఉప్పల్‌లలో రూ.31.36 లక్షల విలువైన ఇళ్ల స్థలాలు, ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో రూ.2.75 కోట్ల విలువైన జీ-ప్లస్ 3తోపాటు పెంట్ హౌస్, రూ.1.06 లక్షల విలువైన వాణిజ్య దుకాణం, హబ్సీగూడ, పెద్ద అంబర్‌పేటల్లో 400 గజాల విస్తీర్ణంలో రెండు ఓపెన్ ప్లాట్లు, పార్కింగ్ స్థలం, మేడిపల్లిలో 3,006 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, గాంధీ నగర్‌లో 633 గజాల స్థలం, సూర్యాపేటలోని మామిళ్లగడ్డలో రూ.4.75 లక్షల విలువ గల ఇల్లుతోపాటు 580 గజాల స్థలం గుర్తించారు. ఉప్పల్- హైకోర్టు కాలనీలోని ఇంట్లో 1,792 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.73 లక్షల విలువైన 2 (రూ.50 లక్షల విలువ గల టయోటా ఫార్చ్యూనర్, రూ.21లక్షల మహీంద్రా థార్) కార్లు, రూ.2.80 లక్షల విలువ గల 3 ద్విచక్ర వాహనాలు, రూ.29.08 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.7,01,171 విలువ గల ఎలకా్ట్రనిక్ పరికరాలను గుర్తించారు. వీటితోపాటు బ్యాంకు ఖాతాల్లో రూ.32.30 లక్షల నగదు నిల్వలు ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. వీటి విలువ రూ.4.75 కోట్లు ఉంటుందని ఆయన అన్నారు. ఓ రబ్బరు, మరో ట్రాన్స్‌మిషన్ కంపెనీల్లో యాదగిరిరావు కుమారుడి పెట్టుబడులపై లోతుగా దర్యాప్తు జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరెస్టయిన యాదగిరి రావును ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు ఆనంద్ కుమార్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘క్యూర్’లో అంధకారానికి చెక్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News