Share News

మహారాష్ట్రను ఒప్పించాల్సిందే

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:35 AM

తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్లతో, లేదంటే 150 మీటర్లతోనైనా కట్టేందుకు మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

మహారాష్ట్రను ఒప్పించాల్సిందే
Revanth Reddy, Uttam Kumar Reddy

  • 152 మీటర్లు కుదరకపోతే 150 మీటర్లు

  • ఆ రాష్ట్రం అడిగిన వివరాలన్నీ ఇవ్వండి

  • తుమ్మిడిహెట్టిపై సమీక్షలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్లతో, లేదంటే 150 మీటర్లతోనైనా కట్టేందుకు మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపుపై ఆ రాష్ట్రం సంతృప్తి చెందేలా అవసరమైన గణాంకాలు, సమాచారం మొత్తం అందించాలని స్పష్టం చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, సంబంధిత అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్దేశిత లక్ష్యం మేరకు నీటిని తరలించాలంటే తుమ్మిడిహెట్టి వద్ద వార్ధా, వైన్‌గంగ సంగమ ప్రాంతంలో లంబాకారంలో 152 మీటర్లతో బ్యారేజీ కట్టాల్సి ఉంటుందని సీఎం గుర్తు చేశారు. 150 మీటర్లతోనైనా నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి పొందాలని, ఆ దిశగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ రాష్ట్రంతో సంప్రదింపులు జరపాలని, ఈ ప్రక్రియలో జాప్యం వద్దని స్పష్టం చేశారు.


ఒక్కో ఎత్తుకు కచ్చితమైన లెక్కలు

ఇక ముంపునకు సంబంధించిన సమగ్ర వివరాలపైనే దృష్టి సారించాలని సీఎం అధికారులకు సూచించారు. పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. 148 మీటర్ల ఎత్తుతో కడితే ఏ మేరకు ముంపు ఉంటుంది, 149, 150, 152 మీటర్లతో కడితే ఎలా ఉంటుందన్న కచ్చితమైన లెక్కలను మహారాష్ట్రకు అందించాలని ఆదేశించారు. 152 మీటర్లతో కట్టినా, 150 మీటర్లతో కట్టినా గ్రామాలకు ముంపు ఉండదని, వార్ధా, వైన్‌గంగ సంగమ ప్రాంతంలో నిర్మిస్తేనే ముంపు తీవ్రత తక్కువగా ఉంటుందని అధికారులు సీఎంకు నివేదించారు. దీనిపై కేంద్ర సంస్థల అధ్యయన నివేదికలను మహారాష్ట్రకు అందించాలని సీఎం ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైన నిధులను జాయింట్‌ అకౌంట్‌లో ఉంచడానికి సిద్ధమని స్పష్టం చేశారు. భూముల ముంపుపై మహారాష్ట్ర సర్వే చేయించుకున్నా అభ్యంతరం లేదని, దానికి సహకరించాలి అధికారులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తున్న ఉల్లి

అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 03:49 AM