Share News

‘క్యూర్‌’లో అంధకారానికి చెక్‌!

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:47 AM

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని పలు ప్రాంతాల్లో తరచూ నెలకొంటున్న అంధకారానికి ఇక చెక్‌ పడనుంది. జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్ల పరిధిలో కొత్త వెలుగులకు రంగం సిద్ధమైంది.

‘క్యూర్‌’లో అంధకారానికి చెక్‌!
Hyderabad LED Street Lights

  • ట్రై కార్పొరేషన్లలో రూ.1720.83 కోట్లతో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

  • పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు

  • బీఏసీ-విన్సీ గ్లోబల్‌ సంస్థకు అప్పగింత

  • ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ

  • ఒక్కో లైట్‌కు నెలకు రూ.153.60

  • లైట్‌ వెలగకుంటే రోజుకు రూ.100,

  • సీసీఎంఎస్‌ బాక్స్‌ పనిచేయకుంటే రూ.1500 చొప్పున పెనాల్టీ

  • థర్డ్‌ పార్టీ ఏజెన్సీగా పర్యవేక్షించనున్న ఓయూ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని పలు ప్రాంతాల్లో తరచూ నెలకొంటున్న అంధకారానికి ఇక చెక్‌ పడనుంది. జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్ల పరిధిలో కొత్త వెలుగులకు రంగం సిద్ధమైంది. క్యూర్‌ పరిధిలో 7,60,591 ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆమోదం తెలిపింది. ఒక్కో లైట్‌ ఏర్పాటు, నిర్వహణకు నెలకు రూ.147 అప్‌సెట్‌ ధరగా నిర్ణయించగా.. బీఏసీ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ - విన్సీ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జాయింట్‌ వెంచర్‌) రూ.153.60కు, బజాజ్‌ ఎలక్ర్టికల్స్‌ లిమిటెడ్‌-మ్యాట్రిక్స్‌ మీటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కన్సార్షియం) రూ.153.90కు బిడ్‌లు దాఖలు చేశాయి.


ఎల్‌-1 బిడ్డర్‌గా ఉన్న బీఏసీ-విన్సీని ఎంపిక చేస్తు మంగళవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఈడీ వీధి దీపాలతోపాటు సెంట్రలైజ్‌డ్‌ కంట్రోల్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం (సీసీఎంఎస్‌) సంబంధిత వసతులతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ.1341.60 కోట్లతో (పన్నులు కాకుండా) పదేళ్ల కాల వ్యవధికి కాంట్రాక్టును అప్పగించారు. జీఎస్టీ, థర్డ్‌ పార్టీకి ఫీజు, ఇతరత్రా కలిపి ఈ మొత్తం రూ.1720.83 కోట్లకు పెరగనుంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణను థర్డ్‌ పార్టీ ఏజెన్సీగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షించనుంది. ఇందుకు ఓయూకు రూ.35 కోట్లు చెల్లించనున్నారు. ట్రై కార్పొరేషన్ల మధ్య ఆర్థిక బాధ్యతలను థర్డ్‌ పార్టీ ఏజెన్సీ విభజించనుంది. మొత్తం ప్రాజెక్టుకుగా నోడల్‌ ఏజెన్సీగా జీహెచ్‌ఎంసీ వ్యవహరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


లైట్‌ వెలగకుంటే రోజుకు రూ.100 పెనాల్టీ

గతంలో పూర్వ జీహెచ్‌ఎంసీలో వీధి దీపాల ఏర్పాటు బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎ్‌సఎల్‌)’కు ఏడేళ్ల కాలవ్యవధికి అప్పగించారు. ఆశించిన స్థాయిలో ఈఈఎ్‌సఎల్‌ పనిచేయకపోవడంతో క్యూర్‌ పరిధిలో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు టెండర్‌ పిలిచారు. దీని ప్రకారం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీధి దీపాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం పని చేయకుంటే కాంట్రాక్టు సంస్థకు పెనాల్టీ విధించనున్నారు. వీధి దీపాలు ఎక్కడ, ఏ సమయంలో వెలుగుతున్నాయన్నది డ్యాష్‌బోర్డులో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. రిమోట్‌తోనూ లైట్ల నిర్వహణ చేపట్టేలా కొత్త నిబంధన పెట్టారు. వెలగని లైట్ల మరమ్మతులు/కొత్తవి ఏర్పాటు నిర్ణీత సమయంలో చేయకుంటే ఒక్కో లైట్‌కు రోజుకు రూ.100 చొప్పున పెనాల్టీ విధించనున్నారు. సీసీఎంఎస్‌ బాక్సులు పనిచేయకుంటే రోజుకు రూ.1500 జరిమానా విధించవచ్చని ఒప్పందంలో ఉందని అధికారి ఒకరు తెలిపారు. ట్రై కార్పొరేషన్లే ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తాయి. వాటి పరిధిలో ఏర్పాటు చేసే దీపాల ఆధారంగా ఆ వాటాను విభజించారు.


కార్పొరేషన్ల వారీగా వీధి దీపాలు, వ్యయం...

కార్పొరేషన్‌ వీధి వ్యయం

దీపాలు (రూ.కోట్లలో)

జీహెచ్‌ఎంసీ 3,30,487 747.72

మల్కాజ్‌గిరి 2,44,846 419.16

సైబరాబాద్‌ 1,85,258 553.95

మొత్తం 7,60,591 1720.83


ఈ వార్తలు కూడా చదవండి:

మహారాష్ట్రను ఒప్పించాల్సిందే

మూసీ పనులకు ‘మార్కుల’ పరీక్ష

అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 03:49 AM