మూసీ పనులకు ‘మార్కుల’ పరీక్ష
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:40 AM
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ పనులు దక్కించుకోవాలంటే కాంట్రాక్టు సంస్థలు తక్కువ ధర కోట్ చేస్తే సరిపోదు. పనిని ఎలా చేస్తారన్న దానికి వచ్చే మార్కులూ అంతే కీలకం కానున్నాయి.
తక్కువ ధర కోట్ చేసినంతనే కాంట్రాక్టు దక్కదు..
ఏడీబీ కొత్త నిబంధనతో టెండర్లలో ఎంపీసీ విధానం
హైదరాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ పనులు దక్కించుకోవాలంటే కాంట్రాక్టు సంస్థలు తక్కువ ధర కోట్ చేస్తే సరిపోదు. పనిని ఎలా చేస్తారన్న దానికి వచ్చే మార్కులూ అంతే కీలకం కానున్నాయి. ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణం ప్రతిపాదించిన నేపథ్యంలో, ఆ బ్యాంకు మార్గదర్శకాల మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) మెరిట్ పాయింట్ క్రైటీరియా(ఎంపీసీ) విధానంలో టెండర్లు పిలిచింది. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు జోన్-1ఏ, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు జోన్-1బీగా విభజించి రెండు ప్యాకేజీల్లో పనులు చేపట్టనుంది. బిడ్ల దాఖలుకు ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చింది.
అత్యధిక మార్కులొస్తేనే పనులు
ఏడీబీ నిధులతో చేపట్టే పనుల్లో ఈ ఏడాది కీలక మార్పు వచ్చింది. 2026 జనవరి 1 నుంచి అంతర్జాతీయంగా ప్రకటించే పనులకు ఎంపీసీ తప్పనిసరి అయింది. ఈ విధానం అత్యల్ప మూల్యాంకన బిడ్ పద్ధతి స్థానంలో వచ్చింది. జోన్-1ఏ టెండర్‌లో సాంకేతిక ప్రతిపాదనలకు 50 శాతం, ఆర్ఢిక బిడ్‌కు 50 శాతం వెయిటేజీ నిర్ణయించారు. ముందుగా సాంకేతిక ప్రతిపాదనలకు స్కోరు వేసి, తర్వాత రెండింటి స్కోర్లను కలుపుతారు. ఉమ్మడి స్కోరు ఎక్కువ వచ్చిన బిడ్‌నే అత్యంత ప్రయోజనకరమైనదిగా గుర్తిస్తారు. ఏడీబీ నిబంధనల ప్రకారం పని విలువ, ప్రొక్యూర్‌మెంట్ రిస్క్ ఆధారంగా సాంకేతిక అంశాలకు కనీస వెయిటేజీ ఉంటుంది. అధిక రిస్క్, అధిక విలువ గల పనులకు 50 శాతం, అధిక రిస్క్, తక్కువ విలువ గల పనులకు 60 శాతం, తక్కువ లేదా మధ్యస్థ రిస్క్ ఉండి అధిక విలువ గల పనులకు 10 శాతం, తక్కువ విలువ గల పనులకు 20 శాతం కనీస వెయిటేజీ ఇవ్వాలి. కోటి డాలర్లకు మించిన పనులను అధిక విలువ గలవిగా పరిగణిస్తారు.
సైట్ నిర్వహణ, పనుల షెడ్యూలు, నిర్మాణ పద్ధతి, ఆరోగ్యం-భద్రత, నాణ్యత నిర్వహణ, పర్యావరణం, స్థానిక భాగస్వామ్యం వంటివి సాంకేతిక ప్రమాణాలకు ఏడీబీ ఇచ్చిన నమూనాలు. అయితే, ప్రమాణాలను రూపొందించే బాధ్యత రుణం తీసుకునే పక్షానిదే. వెయిటేజీలను బిడ్డింగ్ పత్రాల్లో ప్రకటించాలి. అంతర్జాతీయంగా ప్రకటించే పనుల్లో మొత్తం పని దినాల్లో కనీసం సగం స్థానిక కార్మికులతో చేయించాలన్న నిబంధన కూడా ఉంది. స్థానిక ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి 15 శాతం వరకు సాంకేతిక మార్కులు కేటాయించవచ్చు. బిడ్లకు ముందస్తు అర్హత దశ లేకపోయినా జోన్-1ఏ ప్రమాణాలు కఠినంగానే ఉన్నాయి. ఒంటరిగా బిడ్ వేసే సంస్థకు గత ఐదేళ్లలో సగటు వార్షిక నిర్మాణ టర్నోవర్ రూ.1,725 కోట్లు ఉండాలి. జాయింట్ వెంచర్ అయితే ప్రతి భాగస్వామికి రూ.430 కోట్లు, ఒక భాగస్వామికి రూ.690 కోట్లు ఉండాలి. గత పదేళ్లలో కనీసం రూ.1150 కోట్ల విలువైన ఒక పని లేదా రూ.950 కోట్ల చొప్పున రెండు పనులు పూర్తి చేసి ఉండాలి.
కనీసం 2.5 కి.మీ. నది లేదా కాలువ అభివృద్ధి పనులు, 4 కి.మీ. నాలుగు వరుసల రహదారి, 800 మీటర్ల వంతెన పనుల అనుభవం కూడా ప్రమాణాల్లో ఉన్నాయి. బిడ్ సెక్యూరిటీగా రూ.23కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. జోన్-1ఏలో ఛైనేజీ 1+320 మీటర్ల నుంచి 8+850 మీటర్ల వరకు సుమారు 7.53 కి.మీ. మేర పనులు చేపడతారు. నదీ ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడం, పేరుకుపోయిన వ్యర్థాలు, పూడిక తొలగింపు, వరద నియంత్రణ పనులు ఇందులో ప్రధానమైనవి. నది ఒడ్డు కోతకు గురి కాకుండా రిటైనింగ్ వాల్స్, ఇరువైపులా కట్టలు, రహదారులు, వంతెనలు నిర్మిస్తారు. యుటిలిటీ కారిడార్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, కల్వర్టులు, మురుగునీటిని తరలించే ట్రంక్ సీవర్ మెయిన్స్, నీటి నిల్వ, మట్టం నియంత్రణకు రబ్బర్ డ్యామ్‌లు కూడా నిర్మిస్తారు. జోన్-1బీలో ఛైనేజీ 0+690 మీటర్ల నుంచి 12+212 మీటర్ల వరకు సుమారు 11.522 కి.మీ. మేర ఇవే తరహా పనులు చేపడతారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఐకానిక్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి ఈ జోన్‌లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. రెండు జోన్ల పనులనూ ఈపీసీ టర్న్‌కీ విధానంలో చేపడతారు. నిర్మాణం పూర్తయ్యాక ఐదేళ్ల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలదే.
తొలిదశకు రూ.7345.12 కోట్లు
తొలిదశ పనులకు ప్రభుత్వం జూలై 9న రూ.7345.12 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. భూసేకరణ వ్యయం ఇందులో లేదు. ఇందులో రూ.4500కోట్లు ఏడీబీ రుణంగా ప్రతిపాదించగా, మిగిలిన రూ.2845.12 కోట్లు హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా సమకూర్చనున్నారు. నిర్వహణ వ్యయంతో కలిపి జోన్-1ఏకు రూ.3232.01 కోట్లు, జోన్-1బీకి రూ.4113.11 కోట్లు కేటాయించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తున్న ఉల్లి
అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News