Share News

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:16 AM

జీతం ఎంత కావాలో మీరే చెప్పండి.. మారుమూల మెడికల్‌ కాలేజీకి వచ్చి పాఠాలు చెప్పండి.. వైద్య నిపుణులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆఫర్‌ ఇది.

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
Telangana Medical Colleges Recruitment

  • మీరు కోట్‌ చేయండి.. నచ్చితే ఇచ్చేస్తాం

  • ప్రస్తుత వేతనాలకు 2-3 రెట్లయినా ఓకే

  • ప్రొఫెసర్‌కు రూ.5.70 లక్షలు వచ్చే అవకాశం

  • మెడికల్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరతకు పరిష్కారం

  • పోటీలో తక్కువ కోట్‌ చేసిన వారికే పోస్టు

  • తొలుత 10 మారుమూల కాలేజీల్లో అమలు

  • దేశ వ్యాప్త నోటిఫికేషన్‌ ద్వారా పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జీతం ఎంత కావాలో మీరే చెప్పండి.. మారుమూల మెడికల్‌ కాలేజీకి వచ్చి పాఠాలు చెప్పండి.. వైద్య నిపుణులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆఫర్‌ ఇది. సాధారణ వేతనాలతో మారుమూల, గిరిజన ప్రాంతాలకు వెళ్లేందుకు నిపుణులు విముఖత చూపుతుండటంతో, వైద్యులే తమ జీతాన్ని కోట్‌ చేసే ‘యూ కోట్‌.. వీ పే’ కాంట్రాక్టు విధానాన్ని ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. అయితే కోట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ పోస్టు దక్కదు. అర్హతలు ఉండి, పోటీలో తక్కువ మొత్తం కోట్‌ చేసిన వారికే అవకాశం లభిస్తుంది. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) సైతం ఆమోదముద్ర వేసి, ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించింది. దీంతో త్వరలోనే అఖిల భారత స్థాయిలో నోటిఫికేషన్‌ జారీ చేసి, పోస్టులు భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.


2-3 రెట్ల వరకు వేతనం

ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న ప్రొఫెసర్లకు నెలకు సుమారు రూ. 1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రూ.1.25 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగరాల్లో ప్రాక్టీస్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకుని మారుమూల జిల్లాలకు వెళ్లేందుకు సీనియర్‌ ఫ్యాకల్టీ ముందుకు రావడం లేదు. కొత్త విధానంలో నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు నిర్దేశిత అర్హతలున్న వైద్యులు తాము ఆశించే నెలవారీ వేతనాన్ని నేరుగా ప్రభుత్వానికి కోట్‌ చేయాలి. తక్కువ పారితోషికం కోట్‌ చేసిన వారికి పోస్టులు కేటాయిస్తారు. ఎంపికైనవారు ప్రస్తుత కాంట్రాక్టు వేతనాల కంటే దాదాపు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఆర్జించే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్‌కు నెలకు సుమారు రూ. 5.70 లక్షల వరకు అందనుంది.


ఎన్‌హెచ్‌ఎం నుంచి రూ. 7.14 కోట్లు

ఈ పద్థతిలో ఎంపికయ్యే ఫ్యాకల్టీకి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి రెగ్యులర్‌ కాంట్రాక్టు బేసిక్‌ వేతనాన్ని చెల్లిస్తుంది. వారు అదనంగా కోరిన మొత్తాన్ని ఎన్‌హెచ్‌ఎం నిధుల నుంచి టాప్‌-అప్‌ ఇన్సెంటివ్‌ కింద సర్దుబాటు చేస్తారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ స్పెషలిస్టు ఇన్సెంటివ్‌ల కోసం కేంద్రం తెలంగాణకు రూ.7.14 కోట్లు మంజూరు చేసింది. గిరిజన జిల్లాల్లో ేసవలందించే 17 మంది స్పెషలిస్టులకు నెలకు రూ. లక్ష చొప్పున, మరో 17 మందికి నెలకు రూ.2.50 లక్షల చొప్పున టాప్‌-అప్‌ ప్రోత్సాహకాలు అందించేందుకు నిధులు ఖరారు చేశారు.


తొలుత 10 కాలేజీల్లో

ఈ విధానాన్ని తొలుత కొమురం భీం ఆసిఫాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నిర్మల్‌, భద్రాద్రి కొత్తగూడెం తదితర 10 మారుమూల జిల్లాల మెడికల్‌ కాలేజీల్లో వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనాటమీ, ఫిజియాలజీ వంటి ప్రీ-క్లినికల్‌ విభాగాలతో పాటు కీలక క్లినికల్‌ విభాగాల్లోనూ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎన్‌ఎంసీ తనిఖీల సమయంలో కనీస ఫ్యాకల్టీ లేకపోతే ఆయా కళాశాలల సీట్ల గుర్తింపుకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో నిపుణులను రప్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

జీహెచ్‌ఎంసీలో ‘అవినీతి’ చేప

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంపు

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 04:16 AM