కోట్లకొద్దీ నకిలీ నోట్లు!
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:20 AM
హైదరాబాద్ నగర శివార్లలో కోట్లకొద్దీ నకిలీ నోట్లను ముద్రించి చెలామణీ చేయటానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
నోట్ల తయారీ యంత్రాలు, డమ్మీ పిస్తోల్, సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
నలుగురి అరెస్టు, పరారీలో ముగ్గురు
కుంట్లూర్ కేంద్రంగా నకిలీ నోట్ల తయారీ
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర శివార్లలో కోట్లకొద్దీ నకిలీ నోట్లను ముద్రించి చెలామణీ చేయటానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఫ్యూచర్ సిటీ షాద్‌నగర్ ఎస్‌వోటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లతో పాటు తయారీకి ఉపయోగించిన యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డితో కలిసి మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా నకిలీ నోట్లను మార్చేందుకు కారులో ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 1వ తేదీన అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రామోజీఫిల్మ్ సిటీ వద్ద రాత్రి 10 గంటలకు వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో స్విఫ్ట్ డిజైర్ కారు (టీఎస్047291)ను ఆపి తనిఖీ చేయగా.. డిక్కీలో రూ.8 లక్షల విలువైన 500 రూపాయల నకిలీ నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే కారులో ఉన్న మడుపోజు కరుణాకర్, చిన్నోళ్ల మాణిక్యరెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్‌రెడ్డి, కరణం అజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి డమ్మీ పిస్తోల్, నకిలీ పోలీసు ఐడీ కార్డులు, వాకీటాకీలు, నాలుగు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో ఏడుగురు సభ్యుల ముఠా కుంట్లూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు గుర్తించారు. ఆ ఇంటిపై దాడిచేసి రూ.6.70 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ ముఠాలోని జెల్లి వెంకటేష్, కుంజా బాలరాజు, కంపసాటి శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని..
ఇబ్రహీంపట్నం ఉప్పరిగూడకు చెందిన మడుపోజు కరుణాకర్, కూకట్‌పల్లి వివేకానందనగర్‌కు చెందిన చిన్నోళ్ల మాణిక్యరెడ్డి, జగిత్యాల జిల్లా కొసునూరుపల్లికి చెందిన చెరుకుపల్లి రత్నాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన కరణం అజయ్‌కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నకిలీ నోట్లను తయారు చేయటం నేర్చుకున్నారు. కుంట్లూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నోట్ల తయారీ మొదలుపెట్టారు. గతంలో కరుణాకర్, మాణిక్యరెడ్డి, అజయ్‌కుమార్ నకిలీనోట్ల తయారీకి ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత జెల్లి వెంకటేష్, కుంజా బాలరాజు, కంపసాటి శ్రీనివా్‌సతో కలిసి నోట్ల తయారీ మొదలుపెట్టినట్లువిచారణలో తేలింది. నకిలీ నోట్లను మార్చే సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే వీరు తాము పోలీసులమని బెదిరించి నిజమైన డబ్బును దోచుకునేవారు. ఇలా ఇద్దరుముగ్గురి నుంచి దోచుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు కరుణాకర్‌పై తిరుమలగిరి పీఎస్‌లో సైబర్ క్రైమ్ కేసు, చిన్నోళ్ల మాణిక్యరెడ్డిపై ఎస్‌ఆర్‌నగర్, ఎల్‌బీనగర్, ఏపీలోని ముదివేడు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంపు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News