Share News

అక్రమంగా అండాల సేకరణ కేసు.. వెలుగులోకి వస్తున్న చీకటి కోణాలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:34 AM

కొంతమంది మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించడంపై మరో ఐదు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్, ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్స్ నిర్వాహకులపై కొత్తగా 5 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.

అక్రమంగా అండాల సేకరణ కేసు.. వెలుగులోకి వస్తున్న చీకటి కోణాలు
Hyderabad Egg Donation Racket

హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కొంతమంది మహిళల నుంచి అక్రమంగా అండాలను (ఎగ్స్) సేకరించడంపై మరో ఐదు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్, ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లీనిక్స్ నిర్వాహకులపై కొత్తగా 5 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. అండాల దానం పేరుతో మహిళల అక్రమ రవాణాకు కొంతమంది పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి డీఎంహెచ్‌ఓల వేర్వేరు ఫిర్యాదులతో జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మియాపూర్, మహంకాళి, మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లలో ఈ కేసులను నమోదు చేశారు. ఆ కంపెనీల డైరెక్టర్, ఎండీ గెదెల దుర్గారావుతో పాటు డోనర్ ఫెసిలిటేటర్లు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్, దీపిక తదితరులపై కేసులు నమోదు చేశారు.


మదీనాగూడ ప్రధాన కార్యాలయంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్రాండ్ పేరుతో 10 రాష్ట్రాల్లో 46 క్లీనిక్‌లను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి నుంచి ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా 66 మంది మహిళల నుంచి అండాలను సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బేగంపేటలోని ఓ మహిళా హాస్టల్‌లో పోలీస్, ఆరోగ్య శాఖ అధికారుల సంయుక్త తనిఖీల్లో 12 మంది బాధిత మహిళలకు విముక్తి కల్పించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మహిళలకు రూ.50 వేల ఆశ చూపి హైదరాబాద్‌కు ఓ ముఠా రప్పించినట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే మహిళలకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చి, బయోమెడికల్ వ్యర్థాల నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసుల విచారణలో తేలింది.


ఒక మహిళాను తీసుకువస్తే ఫెసిలిటేటర్లకు రూ.65 వేల వరకు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. సేకరించిన అండాల సంఖ్య, నాణ్యత తగ్గితే ఫెసిలిటేటర్లకు చెల్లించే మొత్తంలో సగం కోత విధించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి - అక్టోబరు నెలల మధ్య 66 మందికి ఈ ప్రక్రియలు జరపగా, తనిఖీ అధికారులకు కేవలం 47 మందికి సంబంధించిన రికార్డులు మాత్రమే దొరికాయి. మిగిలిన 19 మంది దాతల రికార్డులను ఏఆర్‌టీ బ్యాంక్ దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ రాకెట్‌కు సంబంధించి మల్కాజిగిరి పోలీసులు ఇప్పటివరకు 3 కేసుల్లో 8 మంది నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు - 125, 143(2), 143(3), 271, 318(4), 61(2), 111తో పాటు ఏఆర్‌టీ చట్టం కింద కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu New

Updated Date - Nov 14 , 2026 | 12:34 PM